= బూత్ కమిటీల ఏర్పాటు అవశ్యం
= పొత్తులపై తొందర వద్దు
= బీజేపీ శ్రేణులకు మోడీ దిశానిర్దేశం
క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం అయ్యే దిశగా కార్యక్రమాలు సాగాలని నేతలకు నరేంద్రమోడీ సూచించారు. పొత్తుల ప్రస్తావన ఇప్పుడు వద్దంటూ హితవు పలికారు. మరోవైపు మోడీ పర్యటనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం చెన్నై నగరానికి వచ్చారు. టీ నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుచ్చిలో ఇటీవల నిర్వహించిన సభ విజయవంతం కావడం దేశమంతా చర్చనీయాంశంగా మారిందన్నారు.
ఏ రాష్ట్రానికి వెళ్లినా తిరుచ్చి సభ గురించే అడుగుతున్నారని చెప్పారు. ఈ విజయం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి నిదర్శనమన్నారు. అన్ని లోక్‌సభ స్థానాల్లో పార్టీ స్థితిగతుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా, మండల, పోలింగ్, బూత్ కమిటీల ఏర్పాటు గురించి ప్రశ్నించారు. కమిటీల ఏర్పాటు ఇప్పటికే 90 శాతం పూర్తయిందని నేతలు తెలియజేశారు.
తమిళనాడులో ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తామనే విషయాన్ని ఆలోచించకుండా రాష్ర్టంలోని 45 వేల బూత్ కమిటీలను పటిష్టం చేయాలని ఆదేశించారు. కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించాలని, స్థాయినిబట్టి ఈ కమిటీల్లో చేర్చుకోవాలని సూచించారు. బూత్ కమిటీలు పటిష్టంగా ఉన్నప్పుడే పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కాగలదని పేర్కొన్నారు.
పొత్తుల ప్రస్తావన వద్దు
మోడీ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు లేచి పొత్తులపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కొందరు డీఎంకేతో పొత్తు వద్దంటే, మరికొందరు అన్నాడీఎంకేతో జతకట్టరాదని సూచించారు. మరికొందరు ఒంటరిగా పోటీచేసే సత్తా పార్టీకి ఉందని తెలిపారు. మోడీ స్పందిస్తూ పొత్తుల అంశం ఇప్పుడు అప్రస్తుతమని అన్నారు. పొత్తులపై మీ అభిప్రాయాలు ఏవైనా ఉంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి, పార్లమెంటు ఎన్నికల కమిటీకి తెలియజేయూలని సూచించారు. సుమారు అర్ధగంట సేపు నేతలు, కార్యకర్తలతో మోడీ సంభాషించడం పార్టీలో నూతనోత్సాహం నింపింది.
పిల్ కొట్టివేత
గుజరాత్‌లో ముస్లింల మారణహోమానికి కారకుడైన మోడీని మద్రాసు వర్సిటీలో జరిగే సభకు అనుమతించరాదంటూ తమిళనాడు మక్కల్ కట్చి అధ్యక్షులు తంగ తమిళ్ ఓ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. దీనిని కోర్టు శుక్రవారం కొట్టేసింది. ఒక పార్టీ నేత మరో పార్టీనేతపై వేసే పిటిషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం పరిధిలోకి రాదని కోర్టు వ్యాఖ్యానించింది.
మోడీ రాకపై యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయలేదని తన తీర్పులో పేర్కొంది. ఇదిలావుండగా మోడీ రాకను నిరసిస్తూ ఇండియా జననాయక వాలిబర్ సంఘం, ఇండియా మానవర్ సంఘం, అఖిలభారత జననాయక సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు చెన్నైలో రాస్తారోకో చేపట్టారు. పోలీ సులు స్వల్పంగా లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
పోటెత్తిన జనం
నరేంద్రమోడీ రాక సందర్భంగా ఆయన పర్యటించిన ప్రతిచోటా జనం పోటెత్తారు. చెన్నై విమానాశ్రయం, పార్టీ రాష్ట్ర కార్యాలయం, సెంటినరీ ఆడిటోరియం అన్నిచోట్లా భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. బీజేపీ యువజన, వర్తక విభాగం వారు పెద్ద సంఖ్యలో వాహనాలతో నగరానికి చేరుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులకు జనాన్ని అదుపుచేయడం కష్టమైంది. అదే సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. మోడీ పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.