ముంబై : నగరంలో ఘాటెక్కిస్తున్న ఉల్లిధరను నియంత్రించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించని ముఖ్యమంత్రి చవాన్, ఢిల్లీలో ఉల్లిధరలను తగ్గించేందుకు తన వంతు కృషిచేస్తానని చెప్పడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 లు పలుకుతోంది. దీన్ని అదుపులోకి తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం నామమాత్ర ప్రయత్నం కూడా చేయడంలేదు కానీ ఢిల్లీలో వాటి ధర తగ్గుముఖం పట్టించేందుకు నాసిక్ నుంచి నేరుగా ఉల్లిని కొనుగోలు చేయాలని స్వయానా అక్కడి సీఎం షీలాకి ఫోన్ చేసి మరీ కోరడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
తనకు మాలిన ధర్మం చేస్తున్న సీఎం చవాన్ రాష్ర్ట ప్రజలకు ఏం సమాధానం చెబుతారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఢిల్లీ సర్కార్‌కి కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని నాసిక్ నుంచి కొనుగోలు చేసి అక్కడికి రవాణా చేసేందుకు కొన్ని రోజుల క్రితం ఒక బృందాన్ని పంపించమని అక్కడి సీఎం షీలా దీక్షిత్‌ను కోరానని శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. దీనివల్ల అక్కడి మార్కెట్లలో ఉల్లి కొంత మేర తగ్గి రూ.50లకు కేజీ లభించే అవకాశముంటుందని తెలిపారు. ఇప్పటికే షీలా సర్కార్ ముగ్గురు అధికారులను నాసిక్ పంపిందన్నారు. నాసిక్ మార్కెట్లలో ఉల్లిగడ్డ ధరలు నాణ్యతను బట్టి కేజీకి రూ.38 నుంచి 55 మధ్య పలుకుతోందన్నారు.
అత్యవసర చర్యల కింద మార్కెట్ నుంచి ఉల్లిని నేరుగా కొనుగోలు చేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించిందన్నారు. 12 నుంచి 13 టన్నుల ఉల్లిని ఢిల్లీకి రవాణా చేసేందుకు ట్రక్కుకు అయ్యే ఖర్చు రూ.12వేలు ఉంటుందన్నారు. ఇలా చేయడం వల్ల ఢిల్లీలో ఉల్లి కేజీని రే.50లకు విక్రయించొచ్చని తెలిపారు. ఉల్లిగడ్డ నిల్వదారులపై రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోవాలన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. రాష్ట్రంలో ఉల్లి నిల్వలు ఎక్కడా లేవని తెలిపారు. ఇప్పటికే కూరగాయాలను అక్రమంగా నిల్వ ఉంచిన వ్యాపారులపై రాష్ట్ర సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తు చేశారు. నవంబర్ ఒకటిన భారీ స్థాయిలో ఉల్లి పంట మార్కెట్లకు వచ్చే అవకాశముందని తెలిపారు. వీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తామన్నారు.
తనకు మాలిన ధర్మం
Published Sun, Oct 27 2013 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement