వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి మృతిపై నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆ పార్టీ నేతలు, తెలుగు ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు.
సాక్షి, ముంబై: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి మృతిపై నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆ పార్టీ నేతలు, తెలుగు ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. శోభానాగిరెడ్డి ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె కుటుంబానికి సంతాపం ప్రకటించారు. నంద్యాలలో ప్రచారం ముగించుకొని ఆళ్లగడ్డకు వెళుతున్న మార్గమధ్యంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11.05 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందారు.
తీరని లోటు: మాదిరెడ్డి కొండారెడ్డి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి శోభానాగిరెడ్డి మరణం వైఎస్సార్ సీపీకి తీరని లోటని ముంబైకి చెందిన ఆ పార్టీ నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి తెలిపారు. చివరివరకు పార్టీ కోసం కృషిచేసిన ఆమె ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కర్నూలు జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన శోభానాగిరెడ్డి ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందించేదన్నారు. మహిళల సమస్యలపై పోరాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకోగలిగిందని తెలిపారు. ఆమె ఆళ్లగడ్డ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు.ప్రజావ్యతిరేక విధానాలపై అధికారపక్షాల తీరును ఎండగడుతూ రాజకీయాల్లో ఎదుగుతున్న ప్రముఖ మహిళ నేతల్లో ఒకరిగా ఆమె గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. భౌతికంగా ఆమె అందరికి దూరమైనా, భవిష్యత్ రాజకీయాలకు ఆమె అందరికి స్ఫూర్తిగా నిలుస్తారని కొండారెడ్డి అభిప్రాయపడ్డారు.
పుణేలో...
పుణే, న్యూస్‌లైన్: భూమా శోభానాగిరెడ్డికి పుణేలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. పెద్ద ఎత్తున కర్నూల్ జిల్లాతోపాటు ఇతర జిల్లా ప్రజలు నివసించే ఆదర్శ్‌నగర్‌లో గురువారం సాయంత్రం సంతాప కార్యక్రమం ఏర్పాటుచేశారు. మొదట ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. కర్నూలు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో శోభా నాగిరెడ్డి బలమైన మహిళ నేతగా ఎదిగారన్నారు. నాలుగుసార్లు శాసనసభకు ఎంపికైన ఆమె మరణం కర్నూల్ జిల్లా రాజకీయాలకేకాకుండా రాష్ట్ర రాజకీయాలకే తీరని లోటుగా అభివర్ణించారు. కార్యక్రమంలో రమారెడ్డి, వెంగల్ రెడ్డి, పుల్లయ్య, పంపాపతి, బోయబజారి, చరన్ రాజ్, బాగ్యమ్మ, అనురాధ, లక్ష్మిదేవి, నాగసుబ్బమ్మ పాల్గొన్నారు.