అంతే సంగతులు!
* పార్టీ పరిస్థితిపై ‘మేడమ్’కు కాంగ్రెస్ సీనియర్ నాయకుల లేఖ
* వలస పక్షులకు ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధాన కారణం
* ఏఐసీసీ బృందాన్ని వెంటనే రాష్ట్రానికి పంపండి
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తిరోగమన దిశలో పయనిస్తోందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. పదవుల కేటాయింపుల్లో మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వారికి కాక ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఈ లేఖలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి కాలేదు. ఈ విషయంలో సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలే కారణమని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. వీరిరువురూ వేర్వేరుగా జాబితాలను తయారు చేసి తమ జాబితాకే హైకమాండ్ నుంచి ఆమోద ముద్ర వేయించుకునేందుకు పట్టుదలతో ఉన్నారు. దీంతో దాదాపు ఏడాదిగా నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడుతూ వస్తోంది.
ఇతర పార్టీల నుంచి కొద్ది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధరామయ్య ప్రయత్నిస్తుండటం వల్ల పార్టీనే నమ్ముకున్న వారిలో అసంతృప్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్యతోపాటు ఎమ్మెల్సీ ఉగ్రప్ప, మంత్రి మహదేవ ప్రసాద్, హోంశాఖ మంత్రి కే.జే జార్జ్‌కు సలహాదారుగా ఉన్న మాజీ ఐపీఎస్, సీఎం సిద్ధు ఆప్తుడు కెంపయ్య పార్టీ, ప్రభుత్వంలో అన్నీ తామై వ్యవహరిస్తుండటమే కాకుండా తాజాగా నామినేటెడ్ పోస్టుల జాబితా తయారీలో వీరు సూచించిన వారికే ప్రాధాన్యత కల్పించారని తెలుస్తోంది.
ఇదే విషయాన్ని సీనియర్ నాయకులు ‘మేడమ్’కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈనెల చివర్లో జరగనున్న మంత్రి వర్గ విస్తరణ, పునర్వవస్థీకరణ విషయంలో కూడా సిద్ధరామయ్య వలస పక్షులకే ప్రాధాన్యత ఇవ్వడానికి పావులు కదుపుతున్నట్లు సీనియర్ నాయకులు తెలిపారు. ఈ విషయమై వెంటనే ఏఐసీసీ నుంచి పరిశీలకులను కర్ణాటకకు పంపి పరిస్థితులను చక్కదిద్దక పోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ పార్టీ పట్ల వ్యతిరేక ధోరణితో హైకమాండ్‌కు లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.