దేశ రాజధాని మరో కీలక ఘట్టానికి సిద్దమైంది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఢిల్లీ భవితవ్యాన్ని తేల్చేందుకు నగర వాసులు సిద్దమయ్యారు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని మరో కీలక ఘట్టానికి సిద్దమైంది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఢిల్లీ భవితవ్యాన్ని తేల్చేందుకు నగర వాసులు సిద్దమయ్యారు. ఆమ్ఆద్మీ, బీజేపీ ప్రధానంగా పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో ఎవరిని గద్దెనెక్కించాలో ఓటర్లు ఇవాళ తేల్చనున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.
70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన 673 మంది అభ్యర్థుల జాతకాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. దాదాపు కోటి 33 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి 12వేల 177పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారయంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
నగరంలో 191 అతి సమస్యాత్మక ప్రాంతాలు, 550 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. వీటితో పాటు పోలింగ్ కేంద్రాలు, రద్దీ ప్రాంతాల్లో బందోబస్తు పటిష్టం చేశారు. దాదాపు 55 వేల మంది పోలీసులు, పారామిలటరీ దళాలను రంగంలోకి దించిన అధికారులు సీఆర్పీఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా మోహరిస్తున్నారు.