జోలీ అత్యుత్సాహంపై జర్నలిస్టుల ఆగ్రహం
Published Fri, Nov 29 2013 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
న్యూఢిల్లీ: తహెల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి ఇంటి ముందు జోడీ హల్‌చల్ చేయడాన్ని ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్ తప్పుబట్టింది. జోలీ వ్యహరించిన తీరును ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(డీయూజే)కు చెందిన జెండర్ అండ్ ఎథిక్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. చౌదరీ నేమ్ ప్లేట్‌పై ‘నిందితురాలు’ అని రాసి, ప్రదర్శించడాన్ని డీయూజే తప్పుబట్టింది. తహెల్కా యజమాని తరుణ్ తేజ్‌పాల్‌పై నమోదైన కేసులో షోమా నిందితురాలు కాదనే విషయాన్ని జోలీ గుర్తించాని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు కలుగజేసుకోకపోతే షోమాపై విజయ్ జోలీ అనూయాయులు దాడి కూడా చేసుండేవారని ఆరోపించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, జోలీ తీరును ఖండిస్తారని ఆశిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
జోలీని విచారించిన పోలీసులు...
గురువారం చోటుచేసుకున్న ఘటనపై విచారించేందుకు ఢిల్లీ పోలీసులు బీజేపీ నేత విజయ్ జోలీని సాకేత్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మధ్యాహ్నం 1 గంటకు స్టేషన్‌కు వచ్చిన జోలీని సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. శనివారం కూడా స్టేషన్‌కు రావాల్సిందిగా చెప్పారు. ఆయన నుంచి వాంగ్మూలం సేకరించినట్లు పోలీసులు తెలిపారు. జోలీని అరెస్టు చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘ఆయనపై కేసు నమోదు చేశాం. అందుకే విచారించాం. అవసరమైతే అరెస్టు చేస్తామ’ని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
బీజేపీ సంస్కృతికి అద్దం పట్టింది: కాంగ్రెస్
షోమా చౌదరి ఇంటిముందు జోలీ వ్యవహరించిన తీరు బీజేపీ సంస్కృతికి అద్దం పట్టిందని కాంగ్రెస్ విమర్శించింది. జోలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి షకీల్ అహ్మద్ డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement