సాక్షి, చెన్నై : పార్టీని, కేడర్‌ను నిలుపుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. అదే సమయంలో డీఎండీకేను రక్షించడం లక్ష్యంగా పోటీ సర్వసభ్య సమావేశానికి సన్నద్ధం అవుతున్నట్టు చంద్రకుమార్ ప్రకటించారు. డీఎండీకేలో ముసలం బయలు దేరిన విషయం తెలిసిందే. విజయకాంత్ సతీమణి ప్రేమలత చేతిలోకి చేరిన పార్టీని కైవసం చేసుకునేందుకు చంద్రకుమార్ నేతృత్వంలోని బృందం తీవ్ర కసరత్తుల్లో మునిగింది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎండీకే వర్గాల మద్దతు సేకరించే పనిలో చంద్రకుమార్ నిమగ్నమయ్యారు.
ఒకటి రెండు రోజుల్లో పోటీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రేమలత గుప్పెట్లో ఉన్న డీఎండీకేను రక్షించుకుంటామని చంద్రకుమార్ ప్రకటించడం గమనార్హం. విజయకాంత్ చేతి నుంచి డీఎండీకే ప్రేమలత చేతిలోకి చేరినందుకే, తాము తిరుగు బాటుతో ముందుకు సాగుతున్నామని, ఒకటి రెండు రోజుల్లో తమ నిర్ణయం ఉంటుందని గురువారం చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. పదో తేదిన తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు చంద్రకుమార్ ఉరకలు తీస్తుంటే, మరో వైపు అదే రోజున అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు విజయకాంత్ సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
అలాగే, అదే రోజు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, సర్వ సభ్య సమావేశానికి ఆయన పిలుపు నివ్వడం గమనార్హం. ఇక, ధర్మపురి, కోయంబత్తూరు, నాగపట్నం జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యే విజయకాంత్‌ను కలిసి, ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చే విధంగానిర్ణయం తీసుకోవాలని, గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించి, డీఎంకేలోకి చేరుదామంటూ కన్నీళ్ల పర్యంతంతో ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే, విజయకాంత్ ఏమాత్రం తగ్గని దృష్ట్యా, ఆ నలుగురు చంద్రకుమార్ జట్టులోకి దూకేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, డీఎండీకేలో ముసలం బయలు దేరిన సమయంలో ప్రజా సంక్షేమ కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగో కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి పరుగులు తీశారు. అక్కడ విజయకాంత్‌తో సమాలోచించారు. తదుపరి తన వెంట వచ్చిన కొన్ని పార్టీల నేతల్ని విజయకాంత్‌కు పరిచయం చేసి, వారి మద్దతును స్వీకరించారు.
ఎస్‌ఎంకేలోనూ : ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు రావాలని విజయకాంత్‌పై ఒత్తిడి తెచ్చే విధంగా డీఎండీకేలో తిరుగు బాటు సాగుతుంటే, మరో వైపు అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు రావాలని సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి(ఎస్‌ఎంకే)లో తిరుగు బాటు బయలు దేరింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కాళిదాసు, నాయకుడు ఆదియమాన్ శరత్‌కుమార్ తీరును ఖండిస్తూ తిరుగు బాటు చేపట్టారు. అన్నాడీఎంకేలో అత్యధిక స్థానాలు ఆశించకుండా, కేవలం తన వరకు మాత్రం శరత్‌కుమార్ చూసుకోవడం మంచి పద్ధతి కాదని, ఆ కూటమి నుంచి బయటకు రావాలని ఈ నేతలు నినదించడం గమనార్హం.
కూటమిలోనే గరం గరం:
డీఎంకే అధినేత కరుణానిధిపై ఎండీఎంకే నేత వైగో చేసిన వ్యాఖ్యలను ప్రజా సంక్షేమ కూటమిలో ఉన్న పార్టీలు ఖండిస్తుండడం గమనార్హం. ఆయన వ్యాఖ్యల్ని పట్టించుకోదలచుకోలేదని సీపీఎం నేత జి రామకృష్ణన్ వ్యాఖ్యానించగా, ఆయన వ్యాఖ్యల్ని వీసీకే నేతలు తిరుమావళవన్, రవికుమార్‌లు ఖండించారు. ఇక, సీపీఐ నేత ముత్తరసన్ సైతం ఆ వ్యాఖ్యల్ని అంగీకరించ లేమని వ్యాఖ్యానించారు. ఇక, జీకే వాసన్ సైతం వైగో తీరును తప్పుబట్టారు. వ్యక్తిగత విమర్శలు వైగో మానుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై హితవు పలికారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా వైగోకు వ్యతిరేకంగా డీఎంకే నిరసనలు రాజుకున్నాయి. దీంతో జీవిత కాలంలో తాను చేసిన అతిపెద్ద తప్పు ఇది అని, కరుణానిధి వద్ద బహిరంగ క్షమాపణ కోరుతున్నట్టుగా వైగో ఓ ప్రకటన విడుదల చేశారు.
కెప్టెన్ కసరత్తు
Published Fri, Apr 8 2016 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM
Advertisement