సముద్రపు అడుగుభాగంలో విమాన శకలాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఐదు దశాబ్దాల కిందట సముద్రంలో కూలిపోయిన కోస్ట్‌గార్డ్ యుద్ధవిమాన శకలాలను ఎట్టకేలకు ఇటీవల గుర్తించారు. స్కూబా డైవర్లు పదేళ్లగా చేసిన కృషి ఫలించింది. చెన్నై సమీపంలోని నీలాంగరై వద్ద సముద్రంలో విమానశకలాలను కనుగొన్నారు. 1964 ఆగస్టు 13న చెన్నై కోస్ట్‌గార్డ్‌కు చెందిన చిన్న విమానం చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరి నీలాంగరై సమీపంలోని సముద్రంలో కూలిపోయింది. అధికారులకు తెలియకుండా ఒక మెకానిక్ ఆ విమానాన్ని నడుపుతూ నేలపైకి దించడం చేతకాక, అదుపుచేయలేక పోవడంతో అది సముద్రంలో కూలిపోయింది. ఆ విమానాన్ని నడిపిన మెకానిక్‌ను సమీపంలోని మత్స్యకారులు ప్రాణాలతో కాపాడినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా తమిళనాడుకు చెందిన వివిధ ప్రాంతాల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లినపుడు వారి వలలు దేనికో చిక్కుకుని తెగిపోవడాన్ని గమనించారు. ఖరీదైన వలలు తరచు తెగిపోతూ నష్టపోతున్నామని మత్స్యశాఖ అధికారులకు చెప్పుకొని వాపోయారు. వలలు తెగిపోవడానికి కారణాలు అన్వేషించాల్సిందిగా అధికారులు ఆదేశించారు. పుదుచ్చేరిలోని స్కూబా డైవింగ్ శిక్షకుడు అరవింద్ తరుణ్‌శ్రీ నేతృత్వంలో నీలాంగరై మత్స్యకార ప్రాంతానికి చెందిన సద్గురు, మరో ముగ్గురితో కూడిన బృందం కూలిపోయిన కోస్ట్‌గార్డ్ విమానం కోసం పదేళ్లుగా గాలిస్తోంది. ఈనెల 17న నలుగురు స్కూబా డైవర్లు, కొన్ని ఉపకరణాలు, చేపలు పట్టే 30 మరపడవలతో బయలుదేరారు. చెన్నై సమీపంలోని నీలాంగరై వద్ద తీరం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో సముద్రపు అడుగుభాగంలో తనిఖీలు చేపట్టారు. సముద్రంలో 12 అడుగుల లోతున పాచిపట్టిన విమాన శకలాలను గుర్తించారు. ఈ విషయాన్ని కోస్ట్‌గార్డ్, విమానయానశాఖలకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment