
దసరా ముగిసింది.. చెత్త మిగిలింది
రోడ్లు, మార్కెట్ల వద్ద పేరుకుపోయిన చెత్త దిబ్బలు
బెంగళూరు(బనశంకరి): దసరా.. ఆయుధపూజ, విజయదశమి పండుగ నేపథ్యంలో బీబీఎంపీ పరిధిలో నగరంలోని ప్రముఖ మార్కెట్లు, రోడ్లతో పాటు ప్రముఖ వీధుల్లో చెత్తపేరుకుపోయి రాసులు దర్శనమిస్తున్నాయి. ఆయుధపూజ నేపథ్యంలో రెండు రోజులుగా ప్రజలు నగరంలో ఉన్న ప్రముఖ మార్కెట్లలో గుమ్మడికాయలు, పూలు, అరటిపిలకలు కొనుగోలు చేసి వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం వాటిని రోడ్లుపై పడేశారు. దీంతో నగరవ్యాప్తంగా రోడ్లపై ఎక్కడ చూసినా చెత్తకుప్పలు పేరుకుపోయాయి. వీటితో పాటు నగరంలో యశవంతపుర, కేఆర్.మార్కెట్, ఏపీఎంసీ.యార్డు, యలహంక, మల్లేశ్వరం, సదాశివనగర, జయనగర,జేపీ.నగర, బసవనగుడి, బనశంకని, సారక్కి, మడివాళ తదితర మార్కెట్లు వద్ద గుమ్మడికాయలు, అరటిపిలకలు, పూలు, వ్యర్ధాలు కుప్పలుగా పేరుకుపోయాయి.
దీంతో పౌరకార్మికులు పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి నానాపాట్లు పడుతున్నారు. మామూలు రోజుల కంటే అధికంగా చెత్తపేరుపోవడంతో కొన్నిచోట్ల జేసీబీ యంత్రాల సాయంతో చెత్తను తొలగిస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో చెత్తలారీలకు పూజలు చేసి నిలిపివేశారు. బుధవారం నుంచి లారీలను బయటకు తీసిన పౌరకార్మికులు చెత్తను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం రాత్రి నగరంలో వర్షం కురవడంతో చెత్తరాశుల వద్ద నీరు నిలిచిపోయి అధ్వాన్నకరంగా మారిపోయింది. దీంతో నగరవ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి పౌరకార్మికులు తీవ్రంగా శ్రమిస్తుండగా పూర్తిస్థాయిలో చెత్తను తొలగించడానికి కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంది.