హనీఫా మళ్లీ అరెస్ట్
Published Sun, Aug 4 2013 5:34 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
సాక్షి, చెన్నై: తెన్‌కాశి హనీఫా మళ్లీ అరెస్టు అయ్యాడు. బెంగళూరు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా హనీఫాను చేర్చారు. విచారణ నిమిత్తం అతడ్ని బెంగళూరు తీసుకెళ్లే పనిలో కర్ణాటక పోలీసులు పడ్డారు. ఇటీవల బెంగళూరులోని బీజేపీ కార్యాలయం వద్ద బాంబు పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడుకు ఉపయోగించిన మోటార్ సైకిల్ తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉండడంతో ఆ కేసు విచారణ రాష్ట్రం చుట్టూ సాగుతోంది. రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఇప్పటికే అరెస్ట్ అయ్యూరు. దీనిని నిరసిస్తూ మైనారిటీ సామాజిక వర్గం ఆందోళనలు నిర్వహించింది. అక్రమ అరెస్టులుగా ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో తెన్‌కాశి హనిఫాను పేలుళ్ల కేసులో నిందితుడిగా చేరుస్తూ శనివారం అరెస్టు చేశారు.
మదురైలో హనీఫా
తెన్‌కాశి హనీఫా దిండుగల్ సమీపంలో ఇటీవల అరెస్టు అయ్యారు. బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర విచ్ఛిన్నానికి మదురై సమీపంలో జరిగిన కుట్రలో హనీఫా నిందితుడు. హనీఫా ప్రస్తుతం మదురై కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో బెంగళూరు పేలుళ్ల కేసులో హనీఫా హస్తం ఉన్నట్లు కర్ణాటక పోలీసులు తేల్చారు. అతడ్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక విచారణ బృందం అధికారులు శనివారం మదురై చేరుకున్నారు. అరెస్టుకు సంబంధించిన ఉత్తర్వులను మదురై కేంద్ర కారాగారం అధికారులకు అందజేశారు. హనీఫాను విచారణ నిమిత్తం తీసుకెళ్లడానికి కర్ణాటక పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Advertisement