ఉచితంగా సినిమాలు చేయను
సినిమాల్లో ఎలా నటించినా నిజజీవితంలో మాత్రం చాలా ప్రాక్టికల్‌గా ఉంటానని చెబుతున్నాడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ. ‘రాజా నట్వర్‌లాల్’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ముద్దుల వీరుడు ఉచితంగా సినిమాలు చేయనని చెప్పాడు. నటించడం తన కెరీర్‌లో భాగమని, అందుకే ఉచితంగా ఎవరి బ్యానర్‌లోనూ నటించనని చెబుతున్నాడు. అంతమాత్రాన తాను కేవలం డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే వ్యక్తిని కానన్నాడు. ‘డబ్బు అనేది అందరికీ అవసరమైందే. అంతమాత్రానా దానినే సర్వస్వం అనుకోవడం కూడా సరికాదు.
డబ్బులు తీసుకోకుండా సినిమాల్లో నటించడం వంటివి నేను చేయన’ని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. బాలీవుడ్‌లో దశాబ్ద కాలంగా నటిస్తున్న ఈ హీరోకు మర్డర్, రాజ్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై వంటి చిత్రాలు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఫుట్‌పాత్, దిల్ తో బచ్చా హై జీ, ఘన్‌చక్కర్ వంటి చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినా నటుడిగా ఇమ్రాన్‌కు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అయితే కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తే ఇప్పటిదాకా రెట్టింపు డబ్బు తనవద్ద ఉండేదని, పాత్రలు నచ్చినందునే సినిమాలు అంగీకరించానని చెబుతూనే ఇకపై పాత్రలతోపాటు నటించినందుకు ఇచ్చే పారితోషికం కూడా నచ్చితేనే పచ్చజెండా ఊపుతాన ంటున్నాడు.
ఇక రాజా నట్వర్‌లాల్ సినిమా గురించి మాట్లాడుతూ... సినిమా చూస్తూ ప్రేక్షకులు చప్పట్లు కొట్టకపోతే అది ముమ్మాటికీ వారిని వారు మోసగించుకున్నట్లే అవుతుందని, సినిమా అంత బాగా కుదిరిందని చెప్పాడు. ఘన్‌చక్కర్ సినిమా కోసం కూడా ప్రయోగాలు చేసి, వైఫల్యాన్ని ఎదుర్కొన్న తాను ఈసారి ప్రయోగాత్మక చిత్రం ద్వారా ప్రేక్షకుల మన్ననలందుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు కోరుకునే అన్ని హంగులు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పాడు.