ఓటర్లలో చైతన్యం పెంచే దిశగా...
జాగృతి కార్యక్రమాలను {పారంభించిన బీబీఎంపీ
బెంగళూరు : బీబీఎంపీ ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పని సరిగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా బీబీఎంపీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఓటు హక్కు వినియోగం పై ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా వీధి నాటికలు తదితర కార్యక్రమాల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ వీధి నాటికల కార్యక్రమాన్ని బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్ బుధవారమిక్కడ లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోనీ బీబీఎంపీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు బీబీఎంపీ ఎన్నికల్లో 50శాతానికి మించి పోలింగ్ జరగలేదని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పంచేందుకు గాను వీధి నాటికలు వంటి అనేక జాగృ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈనెల 22న జరగనున్న ఎన్నికలో 60శాతానికి పైగా పోలింగ్‌ను సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు కుమార్ నాయక్ వెల్లడించారు. ఇక ఓటర్లలో జాగృని పెంపొందించే దిశగా ఏర్పాటు చేసిన ఈ వీధి నాటికల బృదాలు నగరంలో ఆరు రోజుల పాటు వీధి నాటికలు ప్రదర్శించనున్నాయని చెప్పారు. అంతేకాక ఓటర్లలో చైతన్యాన్ని పెంపొందించే దిశగా ఇప్పటికే వాహనాలతో మొబైల్ ప్రచారాన్ని సైతం చేపట్టిన విషయాన్ని కుమార్ నాయక్ గుర్తు చేశారు. ఇక ఎన్నికల ప్రక్రియ ఇప్పటికి సగం వరకు పూర్తైదని అన్నారు. నామినేషన్ల ఉప సంహరణకు గురువారం చివరి రోజు కాగా, శుక్రవారం నుంచి నగరంలో ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కాగా, ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. నగరంలోని ప్రజలందరూ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తులని, వారంతా తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుంటారని కుమార్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు.