ఆగని ఐటీ దాడులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆకస్మిక దాడులతో బుధవారం కోలివుడ్‌లో కలకలం రేపిన ఆదాయపు పన్నుశాఖాధికారులు గురువారం కూడా తమ దాడులను కొనసాగించారు. హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన పులి చిత్రాన్ని భారీ హిట్ చేయడం ద్వారా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలని భావిస్తున్నట్లు కోలివుడ్‌లో జోరుగా ప్రచారం సాగింది. అందుకు తగినట్లుగా వివిధ మాధ్యమాల ద్వారా పెద్దఎత్తున ప్రచారాలను నిర్వహించారు. భారీ బడ్జెట్ సినిమాల జోలికి పెద్దగా పోయే అలవాటులేని కోలివుడ్‌లో పులి చిత్రం ఇటీవల పెద్ద చర్చనీయాంశమైంది.
పులి ప్రచార సంబరాలే ఆదాయపు పన్నుశాఖ అధికారులను ఆకర్షించి, దాడులకు పురిగొల్పాయి. అంగరంగ వైభవంగా గురువారం పులి చిత్రం విడుదలకు యూనిట్ మొత్తం సన్నాహాల్లో ఉన్నతరుణంలో ఐటీ అధికారులు అదునుచూసి అటాక్ చేశారు. పులి చిత్రం హీరో విజయ్, నిర్మాతలు కలైపులి ఎస్ థాను, ‘మదురై’అన్బు, సహనిర్మాతలు పీటీ సెల్వకుమార్, సిబూ దేవన్, దర్శకులు శింబూదేవన్‌లకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై బుధవారం ఉదయం దాడులు ప్రారంభించారు. దక్షిణాది సినీపరిశ్రమలో ప్రముఖ హీరోయిన్లుగా వెలిగిపోతున్న నయనతార, సమంత ఇళ్లపై కూడా ఐటీ దాడులు ప్రారంభించారు.
రెండో రోజూ దాడులు: ఇదిలా ఉండగా, హీరో విజయ్, సమంత, నయనతార ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. మొత్తం 10 మంది అధికారులతో కూడిన బృందం నీలాంగరైలోని విజయ్ ఇల్లు, కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఇంటిలోని వారు బైటకు వెళ్లకుండా, బైటవారు లోనికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేగాక ఇంటి ద్వారం, కిటికీ తలుపులు సైతం పూర్తిగా మూసి సోదాలు నిర్వహించారు. అలాగే కేరళ రాష్ట్రం కొచ్చిలోని నటి నయనతార ఇంటిలో రెండోరోజు తనిఖీలు కొనసాగాయి. ఫైనాన్షియర్ అన్బుశోళియన్ ఇంటిలో రెండోరోజు కూడా సోదాలు జరిపారు.
ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదు, నగలు, డాక్యుమెంట్లను లెక్కకట్టేందుకు మరో ఐటీ బృందం పనిచేస్తోంది. తనిఖీల్లో నటుడు విజయ్ పూర్తిగా సహకరించినా అయన అభిమానులు మాత్రం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ ఇంటి ముందు గుంపులుగా చేరడం అధికారులను ఇబ్బందులకు గురిచేసింది. నయనతార, సమంత ఇళ్లలో సహాయ నిరాకరణ సాగినట్లు సమాచారం. తమ విధులకు అడ్డుకుంటే మొత్తం ఆస్తులను సీజ్ చేయాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించడంతో సహాయ నిరాకరణ సద్దుమణిగినట్లు సమాచారం.