- మంత్రి జయచంద్ర హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కృత్రిమ పాలను ఉత్పత్తి చేసే వారికి జైలు శిక్ష విధించడానికి చట్టాన్ని తీసుకు రానున్నట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర తెలిపారు. దీనికి సంబంధించిన ముసాయిదాకు తుది రూపునిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ గుండె దినం సందర్భంగా కర్ణాటక పాడి సమాఖ్య (కేఎంఎఫ్) సోమవారం నగరంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులను సత్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ.... రాష్ట్ర సరిహద్దుల్లో రసాయనాలతో కూడిన పాలను తయారు చేసి, అమ్ముతున్నారని తెలిపారు.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఇలాంటి కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఆరోగ్య, పశు సంవర్ధక శాఖలు సంయుక్తంగా నియంత్రించాల్సి ఉందన్నారు. దీనిపై కార్యాచారణ చేపట్టినప్పటికీ పూర్తిగా నియంత్రించడానికి సాధ్యం కావడం లేదన్నారు.
ఇలాంటి కృత్రిమ పాలను ఉత్పత్తి చేస్తున్న వారిని జైలుకు పంపాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. కాగా శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం కనుక, దీనిపై కేఎంఎఫ్ అవగాహన కల్పిస్తోందన్నారు. పుట్టిన మూడు నెలలకే గుండె జబ్బులు వస్తుండడం ఆందోళనకరమైన పరిణామమని పేర్కొన్నారు. రాష్ర్టంలో వైద్యుల కొరత ఉందని, వారిని గౌరవప్రదంగా చూసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
తరచూ దాడులు జరుగుతుండడంతో గ్రామాలకు వెళ్లడానికి వైద్యులు జంకుతున్నారని ఆయన తెలిపారు. కాగా జయదేవ గుండె ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ సీఎన్. మంజునాథ్ సన్మానం అందుకుని మాట్లాడుతూ ఇటీవల విటమిన్ డీ కొరత ఎక్కువగా కనిపిస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు పాలలో ఆ విటమిన్‌ను కలపాల్సిందిగా కేఎంఎఫ్‌కు సూచించారని చెప్పారు.
దీంతో ఏ, డీ విటమిన్లను అందులో కలుపుతున్నారని వెల్లడించారు. డీ విటమిన్ కొరత వల్ల గుండె సంబంధ రోగాలు ఎక్కువయ్యాయని చెప్పారు. ఇటీవల మూడు వేల మందికి పరీక్షలు నిర్వహించగా, 70 నుంచి 75 శాతం మందికి డీ విటమిన్ లోపించినట్లు వెల్లడైందని ఆయన తెలిపారు. సన్మానాన్ని అందుకున్న వారిలో మల్య ఆస్పత్రికి చెందిన డాక్టర్ వీకే. శ్రీనివాస్, డాక్టర్ హెచ్‌ఎస్. శ్రీకంఠ ఉన్నారు.