
మరో పోరాటం
జేడీఎస్ పటిష్టత కోసం కృషి: హెచ్.డి.దేవేగౌడ
బెంగళూరు: రాష్ట్రంలోని రెండు జాతీయ పార్టీలకు ధీటుగా జేడీఎస్‌ను మరింత పటిష్టం చేసేందుకు మరోసారి పోరాటాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడ తెలిపారు. నగరంలోని కృష్ణామిల్ వద్ద నూతనంగా నిర్మించనున్న జేడీఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ నిర్వహించిన అనంతరం హెచ్.డి.దేవేగౌడ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా పార్టీని పటిష్టం చేసేందుకు తన వద్ద లక్షలాది కార్యకర్తలున్నారన్నారు. వారందరినీ ఒక్కతాటి పైకి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.
జేడీఎస్‌ను రాష్ట్రంలో శక్తివంతమైన పార్టీగా రూపొందించడమే తన లక్ష్యమని, అందుకే ఈ వయసులోనూ పోరాటానికి సిద్ధమయ్యానని అన్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇక తమ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం నగరంలో కొంత స్థలాన్ని కేటాయించినందుకు బీబీఎంపీ మేయర్ శాంతకుమారి, డిప్యూటీ మేయర్ రంగణ్ణతోపాటు బీబీఎంపీలోని ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని దేవేగౌడ తెలిపారు. 15 రోజుల్లో ఈ స్థలంలో ఓ తాత్కాలిక షెడ్‌ను నిర్మించి, అనంతరం పూర్తిస్థాయి కార్యాలయాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.