రహస్య ప్రాంతానికి బాలనేరస్తుడి తరలింపు!
న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచారం కేసులో జువైనల్ నేరస్తుడిని శనివారం జువైనల్ హోం నుంచి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. సెక్యూరిటీ కారణాలకి దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా అతడిని అక్కడ నుంచి తరలించినట్లు తెలుస్తోంది. కాగా జువైనల్ నేరస్తుడు ఆదివారం విడుదల కానున్నాడు. మహిళలపై జరిగిన అకృత్యాల్లో అత్యంత హేయమైనదిగా భావించే నిర్భయ ఉదంతంలో దోషిగా నిరూపితుడై, మూడేళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న బాలనేరస్తుడు(ఇప్పుడతని వయసు 20 ఏళ్లు) డిసెంబర్ 20న విడుదల కానున్న విషయం తెలిసిందే.
మరోవైపు బాలనేరస్తుడు విడుదలయ్యే రోజు.. జువైనల్ హోం వద్దకు అతడి కుటుంబ సభ్యులను రప్పించి, తిరిగి అందరినీ సురక్షితంగా స్వగ్రామం చేర్చేందుకు అయ్యే రవాణా ఖర్చును ఢిల్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ భరించనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
అలాగే బాల నేరస్తుడు హోమ్ నుంచి విడుదలయిన తర్వాత, తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అతడికి సహకరిస్తామని, టైలర్ షాప్ ఏర్పాటుచేసుకునేందుకుగానూ 10వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపుబాల నేరస్తుడి విడుదలను నిరసిస్తూ బాధితురాలు జ్యోతిసింగ్ తల్లిదండ్రులతో పాటు బంధువులు శనివారం సాయంత్రం జువైనల్ హోం వద్ద నిరసనకు దిగారు.