దత్తతకు గ్రామం
ఒక ఎంపీ ఒక గ్రామం నినాదంతో ఓ గ్రామాన్ని దత్తతకు స్వీకరించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి నిర్ణయించారు. తూత్తుకుడి జిల్లా ఆళ్వార్ తిరునగర్ పరిసరాల్లో పర్యటించిన ఆమె శ్రీ వెంకటేశ్వర పురాన్ని దత్తతకు తీసుకున్నారు.
* ఎంపీ కనిమొళి నిర్ణయం
* తూత్తుకుడిలో పర్యటన
సాక్షి, చెన్నై: ఒక ఎంపీ ఒక గ్రామం నినాదంతో గ్రామాల దత్తతకు పీఎం నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపునకు రాష్ట్రంలో స్పందించిన తొలి ఎంపీగా రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఖ్యాతి గడించారు. ఇటీవల పీఎం నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూసి చివరకు కనిమొళి భంగపడ్డ విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాజాగా మోదీ ఇచ్చిన పిలుపునకు ఆ పార్టీ ఎంపీ ఇంత వరకు స్పందించ లేదు. ఇతర పార్టీలు సైతం ఇంకా మేల్కొన లేదు. అయితే, తాను ఎల్లప్పుడూ ప్రజా సేవలో ముందుంటానని చాటుకునే విధంగా, పరోక్షంగా మోదీ దృష్టిలో పడే రీతిలో ఓ గ్రామాన్ని దత్తతకు స్వీకరించేందుకు నిర్ణయించారు.
దత్తతకు స్వీకారం : తూత్తుకుడి జిల్లా ఆళ్వార్ తిరునగర్ యూనియన్ పరిసరాల్లో బుధవారం కనిమొళి పర్యటించారు. అక్కడి శ్రీవెంకటేశ్వర పురం గ్రామాన్ని దత్తతకు స్వీకరించారు. అక్కడి ప్రజలతో ముచ్చటించారు. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్ణయించారు. మీడియాతో కనిమొళి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తమ గ్రామాన్ని దత్తతకు స్వీకరించాలని, ఇక్కడి ప్రజలు తనకు విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. అందుకే ఈ గ్రామంలో పర్యటించి, ఇక్కడి వసతులు, ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాల్ని స్వయంగా తెలుసుకున్నట్లు చెప్పారు.
ఇక్కడ భూగర్భ జలాల్ని పీల్చే చెట్లు అనేకం ఉన్నాయని, వాటిని తొలగించి, ప్రజోపయోగకరంగా ఉండే చెట్ల పెంపకం మీద దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. తాగునీటి వసతుల కల్పన, రోడ్లు, కనీస సదుపాయూల కల్పన మీద దృష్టి సారిస్తామన్నారు. ఇక్కడి ప్రజలు విద్యా పరంగా, వైద్య, ఆరోగ్య పరంగా సేవల్ని అంది పుచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఇక్కడి ప్రజలతో కలసి తాను స్వయంగా అభివృద్ధిలో పాలు పంచుకోబోతున్నట్టు పేర్కొన్నారు.