మళ్లీ రచ్చకెక్కిన కుష్భు...
► కాంగ్రెస్‌లో కుష్భు చర్చ
► ఆమె వ్యక్తిగతమన్న తిరునావుక్కరసర్
► ఆహ్వానించిన తమిళి సై
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో, వివాదాలు కొని తెచ్చుకోవడం, చర్చల్లోకి ఎక్కడం సినీ నటి,కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బుకు కొత్తమీ కాదు. తాజాగా దేశ వ్యాప్తంగా మైనారిటీ సంఘాలు, పార్టీలు, కాంగ్రెస్‌తో పాటుగా కొన్ని ప్రతి పక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్న అంశంలోకి తలదూర్చి రచ్చకెక్కారు.
సాక్షి, చెన్నై: యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ- ఉమ్మడి పౌరసృ్మతి)కి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు మద్దతు పలికారు. అయితే అత్యవసరంగా ఆ చట్టం తీసుకురావడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. కుష్భు వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చకు దారి తీశాయి. ఆమె వ్యక్తిగత అభిప్రాయమే గానీ, పార్టీతో సంబంధం లేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ దాట వేశారు. ఆమె వ్యాఖ్యల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ఆహ్వానించారు. దేశంలోని వివాహ వ్యవస్థలో ఉమ్మడి పౌరసృ్మతిని ప్రవేశ పెట్టేందుకు కేంద్రం చర్యల్ని వేగవంతం చేసి ఉన్న విషయం తెలిసిందే.
ట్రిపుల్ తలాక్‌ను ఇక దేశం నుంచి సాగనంపినట్టే అన్నట్టుగా కేంద్రంలోని పాలకుల వ్యాఖ్యలు దేశంలోని మైనారిటీల్లో ఆక్రోశాన్ని రగిల్చి ఉన్నాయి. ముస్లిం వ్యక్తిగత చట్టాలను సమీక్షించి, వివాహం, విడాకుల విషయంలో ప్రత్యేక నిబంధనల్ని అమలు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదన్న ఆగ్రహం బయల్దేరింది. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా తమిళనాడులోని వివిధ పార్టీల్లో ఉన్న మైనారిటీ సంఘాల నాయకులు, పలు మైనారిటీ పార్టీలు ఏకమై ఉద్యమించే పనిలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో కుష్భు యూసీసీకి మద్దతుగా స్పందించడం ఆ సంఘాలకు పుండుమీద కారం చల్లినట్టు అయింది. కాంగ్రెస్ వర్గాలు అయోమయంలో పడ్డాయి. పార్టీలో చర్చకు దారి తీయడంతో ఢిల్లీ వరకు పయనించే అవకాశాలు ఎక్కువే. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూసీసీకి మద్దతు ఇచ్చినట్టు ఇచ్చిన కుష్భు, అమల్లో అంత అవసరం ఎందుకో అని కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం.
మీడియా ముందు వెల్లడి
ఓ మీడియాతో కుష్భు మాట్లాడుతూ, ప్రపంచంలో అనేక దేశాలు యూసీసీని అమల్లోకి తెచ్చినట్టు వివరించారు. అన్ని మతాలకు వ్యక్తిగత చట్టాలు ఉంటాయని, కాలానుగుణంగా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా కొత్త చట్టాలు తీసుకురావాలని, స్వతంత్రంగా మహిళలు ముందుకు సాగే పరిస్థితుల్ని కల్పించాలని సూచించారు. ఇందుకు తగ్గట్టుగా కేంద్రం తీసుకుంటున్న చర్యల్ని సమర్థిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. యూసీసీని తాను ఆహ్వానిస్తున్నానని, మద్దతు పలుకుతున్నట్టు స్పందించారు.
అయితే ఆగమేఘాలపై చట్టం తీసుకురావాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకో అని ప్రశ్నించారు. అన్ని మతాల పెద్దల్ని ఒక చోట కూర్చొబెట్టి, అందుకు తగ్గ చర్చ, సమీక్షల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలే గానీ, ఇలా ఆగమేఘాలపై చట్టం తీసుకు వచ్చేందుకు ఉరకలు తీయడాన్ని ఖండిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ తాజా చర్యలను చూస్తుంటే, కేవలం యూపీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని సాగిస్తున్నట్టుందని విమర్శించారు. యూసీసీకి తాను మద్దతు అని కుష్భు స్పందించడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చ బయలుదేరింది.
ఈ విషయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ను ప్రశ్నించగా, ఆమె వ్యక్తిగత అభిప్రాయమే గానీ, పార్టీ నిర్ణయం కాదంటూ దాట వేశారు. ఇక, వీసీకే నేత తిరుమావళవన్ స్పందిస్తూ, కుష్భు అవగాహన లోపంతో స్పందించి ఉన్నారని విమర్శించారు. మైనారిటీ సంఘాలు, పార్టీల నా యకులు కుష్భు వ్యాఖ్యల్ని ఖండించే పనిలో పడ్డారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ కుష్భుకు మద్దతుగా నిలిచారు. మైనారిటీ సామాజిక వర్గం నుంచి వచ్చిన కుష్భు యూసీసీకి మద్దతుగా స్పందించడం ఆహ్వానిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.