ప్రియుడి కోసం కన్న బిడ్డలకు వాతలు
వేలూరు: ప్రియుడితో ఉల్లాస జీవితానికి అడ్డంకిగా ఉన్నారని కన్న బిడ్డలకు చిత్రహింసలు పెడుతూ నిత్యం నరకం చూపుతున్న తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరుత్తణికి చెందిన గణేశన్, కవిత(27) దంపతులు. వీరికి మహాలక్ష్మి, కార్తీక్ అనే ఇద్దరు పిల్లలున్నారు. గణేశన్ 7సంవత్సరాల కిందట మృతి చెందాడు. ఈ స్థితిలో రెండేళ్ల కిందట కవిత ఇద్దరు పిల్లలను తీసుకొని వేలూరు జిల్లా గుడియాత్తంకు చేరింది. అక్కడ రాజన్ ఆలయం ప్రాంతంలోని హౌసింగ్ బోర్డులో నివసిస్తోంది. పిల్లలు మహాలక్ష్మి 6వ తరగతి, కార్తీక్ ఐదవ తరగతి చదువుతున్నారు.
ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన రామలింగం కుమారుడు గోపితో కవితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో కవిత, గోపి వివాహం చేసుకొని ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. తమ ఉల్లాస జీవితానికి అడ్డుగా ఉన్న పిల్లలను వీరిద్దరూ చిత్రహింసలకు గురిచేసేవారు. కవిత రోజూ మహాలక్ష్మికి పాత్రలు కడగడం, దుస్తులు ఉతకడం వంటి పనులు చెప్పి పని చేయకుంటే శరీరంపై వాతలు పెట్టడం, వేడి నీళ్లు పోయడం వంటివి చేస్తూ తరచూ హింసించేది. ఈ నేపథ్యంలో తమ ఉల్లాస జీవితానికి పిల్లలు అడ్డంకిగా ఉన్నారని కవిత, గోపి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో ఆగ్రహంగా ఉన్న కవిత శనివారం ఉదయం పిల్లలపై వేడి నీళ్లను పోసింది. చిన్నారులు ఏడుస్తూ బయటకు పరుగులు తీయడంతో ఇరుగుపొరుగు వారిని దగ్గరకు తీసుకుని విషయం ఆరాతీశారు. అనంతరం దీనిపై గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి కవితతో పాటు ఆమె ప్రియుడు గోపిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. తీవ్ర గాయాలైన చిన్నారులు మహాలక్ష్మి, కార్తీక్‌లను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.