న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత మహిళల్లో చైతన్యం పెరిగింది. పోలీస్‌స్టేషన్ మెట్లెక్కి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత రెండు నెలల కాలంలో ఢిల్లీ పోలీసు స్టేషన్లలో సుమారు 300 రేప్ కేసులు, 500కు పైగా వేధింపుల కేసులు నమోదయ్యాయి. ‘కేసుల సంఖ్య పెరగడం శుభ పరిణామం. నిర్భయ ఘటన తర్వాత మహిళల్లో ఉన్న స్తబ్ధత తొలగిపోయింది. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రస్తుతం మహిళలు ధైర్యంగా స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ’ అని ఢిల్లీ పోలీసులు అభిప్రాయపడ్డారు. గత రెండు నెలల కాలంలో పోలీసుల రికార్డుల సమాచారం ప్రకారం ఐపీసీ 354, 509(వేధింపులు, బలవంతపు లైంగిక దాడి) సెక్షన్ల కింద 500 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. 2014 డిసెంబర్ 15కు ముందు రాష్ట్రంలో 4,179 వేధింపుల కేసులు నమోదైతే 67.17 శాతం కేసులు పరిష్కారం అయ్యాయి.
పరిచయమున్న వారే నిందితులు
వేధింపులు, అత్యాచార కేసుల్లో 96 శాతం మంది బాధితులు తమకు, తమ తల్లిదండ్రులకు పరిచయం ఉన్న వారి చేతుల్లోనే మోసానికి గురవుతున్నట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బాస్సీ తెలిపారు. కేవలం 4 శాతం మంది మాత్రమే అపరిచితుల చేతుల్లో బలవుతున్నట్లు స్పష్టం చేశారు. పురుషుల వేధింపులను ఎదుర్కోవడానికి మహిళల్లో స్వీయ సంరక్షణకు మెలకవులు, భౌతిక సామర్థ్యం పెంచడానికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బాల్య దశ నుంచే పాఠశాలల్లో స్వీయ రక్షణ కోసం బాలిక లకు శిక్షణను ఇస్తే వారికి 15 ఏళ్లు వచ్చే సరికి పోకిరీల భరతం పడతారని వివరించారు. ఈ ఏడాది ‘లక్ష మంది’ బాలికలకు వాటిపై శిక్షణను ఇవ్వాల్సిందిగా లక్ష్యం నిర్దేశించుకున్నామని తెలిపారు. మార్చి 8 ఆదివారం నాటికి 26 వేల మంది బాలికలకు శిక్షణను ఇచ్చినట్లు ఆనందం వ్యక్తం చేశారు.
‘మహిళా’ పోలీసులకు పదోన్నతులు
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో 45 మంది మహిళా ఎస్‌ఐలకు ఇన్‌స్పెక్టర్ల ర్యాంకుతో పదోన్నతులిచ్చారు. దీంతో 20 ఏళ్ల ఎస్‌ఐల నిరీక్షణకు తెరపడింది. దీనిపై పోలీసు కమిషనర్ బీఎస్ బస్సి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. స్టేషన్లలో మహిళా పోలీసుల అవసరం చాలా ఉందని ఆయన తెలిపారు. వీరితో మహిళలపై నేరాలను నియంత్రించొచ్చన్నారు. త్వరలోనే మహిళా భద్రతకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
నిర్భయ ఘటన తర్వాత మహిళల్లో పెరిగిన చైతన్యం
Published Sun, Mar 8 2015 10:32 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
Advertisement