కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు రక్షణలేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు.
చంద్రాపూర్: కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు రక్షణలేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఇక్కడ జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పది రాష్ట్రాలకు గాను ఏడు రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా వేధింపులను ఎదుర్కొన్నట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించిందని చెప్పారు. ఎన్‌సీఆర్‌బీ రికార్డు ప్రకారం బీజేపీ లేదా దాని కూటమిలోని పార్టీలు అధికారంలో రాష్ట్రాల్లో మహిళలపై ఒక్క నేరం కూడా నమోదు కాలేదన్నారు.
‘‘మేడమ్ సోనియాజీ మీరు మహిళ. అయినప్పటికీ దేశ మహిళలను తప్పుదోవ పట్టించారు. మీ ప్రభుత్వ హయాంలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో దేశం తెలసుకోగోరుతోంది’’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు రక్షణ లేనప్పుడు ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో దేశ మహిళలకు భద్రత ఉండవోదని అన్నారు. లాతూర్ కాంగ్రెస్ కార్యకర్త, న్యాయవాది కల్పనా గిరి హత్యను ఆయన ప్రస్తావించారు. యువ కాంగ్రెస్ నేత అదృశ్యమై శవమై తేలినట్లు తాను వార్తా పత్రికల్లో చూశానన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ నాయకులు అరెస్టయ్యారన్నారు. మీ పార్టీలోనే మహిళలకు రక్షణ లేనప్పుడు దేశంలో మహిళలు సురక్షితంగా ఉండగలరని మోడీ ప్రశ్నించారు. నిర్భయ ఫండ్ కింద వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారని, కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని బీజేపీ నేత విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు.
గడ్చిరోలీ, చంద్రాపూర్ జిల్లాల్లో అమాయకుల హత్యలను, రక్తపాతాన్ని ఆపివేయాలని మోడీ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఆయుధాలను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రభుత్వం గడ్చిరోలీలోని అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతోందని విమర్శించారు.