ప్రచారం అదరాలి!
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ తాజాగా తన ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ విజయవంతం కావడం, ఆప్ ఈసారి కూడా సత్తా చూపుతుందని సర్వేల్లో తేలడంతో కాంగ్రెస్ అప్రమత్తమయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్యర్యంలో ఈ నెలాఖరును నిర్వహించే ర్యాలీ పార్టీ సామర్థ్యానికి పరీక్షగా మారింది.
బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ బుధవారం శాస్త్రిపార్క్‌లో నిర్వహించిన జనసభ కన్నా భారీస్థాయిలో సోనియాగాంధీ ర్యాలీని నిర్వహించడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం రేకెత్తించి, ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కరోల్‌బాగ్‌లోని అజ్మల్‌ఖాన్ పార్క్‌లో జరిగే ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు, ఆయన బృందం తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. క్రితంసారి లోక్‌సభ ఎన్నికల్లో అన్ని లోక్‌సభ స్థానాలనూ కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ, ఈసారి ఆ పరిస్థితి ఎంతమాత్రమూ కనిపించడం లేదు.
ఏయే స్థానాల్లో విజయం సాధిస్తామనే ప్రశ్నకు కాంగ్రెస్ నేతలు కచ్చితంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. తాజా ర్యాలీలోనూ నరేంద్రమోడీ ఆప్‌నే ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకున్నట్టు స్పష్టమయింది. తమ పార్టీ అధికారంలోకి రాకుండా చూడడానికి ఆప్ ఇతర పార్టీలతో కలసి కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.ఇటీవలి విధానసభ ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా కాంగ్రెస్ నేతలు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో దక్షిణ ఢిల్లీలో రాహుల్ గాంధీ బహిరంగసభ అభాసుపాలయిన దృష్ట్యా కాంగ్రెస్ నేతలు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వేతర సంస్థల సభ్యులు, హోంగార్డులు, కాంట్రాక్టు టీచర్లు, ఎలక్ట్రానిక్ రిక్షాల డ్రైవర్లను సభకు రప్పించడానికి ప్రత్యేకంగా ప్రయత్నిసున్నారు. కేంద్రమంత్రి, న్యూఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ సోనియా గాంధీ ర్యాలీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణ ఎలా జరపాలి, ఏర్పాట్లు ఎలా చేయాలనే విషయాలు చర్చించడానికి కాంగ్రెస్‌లోని అన్ని స్థాయిల నేతలు సమావేశాలు జరుపుతున్నారు.
కనీసం 50 వేల మంది సభకు హాజరయ్యేలా చూడాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అజ్మల్‌ఖాన్ పార్క్‌లో 16 వేల కుర్చీలు వేస్తారని, జనాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వెయ్యి మంది కార్యకర్తలను మోహరిస్తారని అంటున్నారు. సోనియా గాంధీ ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి అజ్మల్‌ఖాన్ పార్క్ పరిసరాల్లోని కూడళ్లలో ఎల్‌సీడీ స్క్రీన్లను అమర్చనున్నారు. ర్యాలీలో పాల్గొనవలసిందిగా ప్రజలను కోరడానికి లవ్లీ శుక్రవారం నుంచి ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాలను సందర్శిస్తారని కాంగ్రెస్ ప్రతినిధి ముకేష్ శర్మ చెప్పారు. సోనియార్యాలీని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని అన్నారు.