అధికారంలోకి వచ్చి ఏడాదైనా గడవకనే పలువురు మంత్రులు తమ నియోజక వర్గాల్లో చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
- ఏడాదైనా గడవకనే..
- 13 మంది మంత్రులకు ఎదురు గాలి
- వారి నియోజక వర్గాల్లో బీజేపీ ఆధిక్యత
- మోడీ హవానే కారణమా?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అధికారంలోకి వచ్చి ఏడాదైనా గడవకనే పలువురు మంత్రులు తమ నియోజక వర్గాల్లో చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో వారి నియోజక వర్గాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను సాధించగలిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గంలో మొత్తం 30 మంది మంత్రులుండగా 13 మంది తమ పార్టీ అభ్యర్థులకు ఆధిక్యతను తెచ్చి పెట్టలేకపోయారు.
గత ఏడాది మే నెలలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఈ నియోజక వర్గాల్లో వారు మంచి మెజారిటీతో గెలుపొందారు. అయితే ఓటర్లు ఈసారి బీజేపీకి ఓటు వేశారు. దీనికి కారణాలెన్నో ఉన్నప్పటికీ, మోడీ ప్రభంజనమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా... ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజక వర్గంలోని గాంధీ నగర సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి పీసీ.
మోహన్‌కు సుమారు 38 వేల ఓట్ల ఆధిక్యత లభించింది. శాసన సభ ఎన్నికల్లో ఇక్కడ గుండూరావుకు 22,607 ఓట్ల ఆధిక్యత లభించింది. మరో విశేషమేమిటంటే అప్పుడు ఇక్కడ ఆయన ప్రత్యర్థి కూడా పీసీ. మోహనే. మరో యువ మంత్రి, బ్యాటరాయనపురకు ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడకు కూడా ఓటర్లు ఖంగు తినిపించారు. బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోకి వచ్చే ఈ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి డీవీ. సదానంద గౌడకు 35,977 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇక యడ్యూరప్ప పోటీ చేసిన శివమొగ్గ నియోజక వర్గంలోని తీర్థహళ్లి సెగ్మెంట్‌లో బీజేపీకి 28,503 ఓట్ల మెజారిటీ లభించింది.
పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ ఈ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గదగ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణావృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్, నగరంలోని బీటీఎం నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళకు చెందిన అటవీ శాఖ మంత్రి రమానాథ్ రై, ఉడిపి జిల్లా కాపు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పట్టణావృద్ధి శాఖ మంత్రి విజయ్ కుమార్ సొరకె, రాయచూరు జిల్లా కనకగిరికి చెందిన మధ్య తరహా నీటి పారుదల శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి, చిత్రదుర్గ జిల్లా హొలల్కెరెకు ప్రాతినిథ్యం వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయలతో పాటు మంత్రులు అభయ చంద్ర జైన్, సతీశ్ జారకిహొళి, ఉమాశ్రీ, పీటీ. పరమేశ్వర్ నాయక్‌లు తమ పార్టీ అభ్య ర్థులకు మెజారిటీని చూపించలేక పోయారు.