హర్యానాలో అక్టోబర్ 15వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అభ్యర్థులపై చర్యలకు ఈసీ నడుంబిగించింది. బాద్‌షాపూర్ నియోజకవర్గ
గుర్గావ్: హర్యానాలో అక్టోబర్ 15వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అభ్యర్థులపై చర్యలకు ఈసీ నడుంబిగించింది. బాద్‌షాపూర్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి ముఖేష్ శర్మ ఎలక్షన్ అధికారి నుంచి అనుమతి తీసుకోకుండానే బహిరంగ సమావేశం నిర్వహించినందుకు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ పీఎస్ చౌహాన్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్‌ఓ) మంగళవారం నోటీసు జారీ చేశారు. నోటీసు అందిన 48 గంటల్లో సమాధానం చెప్పాలని, సకాలంలో స్పందించకుంటే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తక్షణమే చర్యలు తీసుకొంటామని నోటీసులో హెచ్చరించారు.
ఎన్నికల అధికారి నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ముఖేష్ శర్మ భారీ ఎత్తున కార్యకర్తలను తరలించి బహిరంగ సమావేశం నిర్వహించినట్లు ఓ హిందీ పత్రికలో మీడియా కథనం ప్రచురితమైందని, అందుకే అతడికి నోటీసు జారీ చేసినట్లు ఆర్‌ఓ చెప్పారు. ఇంకా పలుచోట్ల ఎన్నికల అధికారుల అనుమతులు తీసుకోకుండానే బహిరంగ సమావేశాలు నిర్వహించనట్లు పేర్కొన్నారు. ఎన్నికల మోడల్ కోడ్ సెప్టెంబర్ 12వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని చెప్పారు.
90 మంది సభ్యులున్న అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 15వ తేదీన నిర్వహించామని, అక్టోబర్ 19వ తేదీన కౌంటింగ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి అభ్యర్థులు కచ్చితంగా సంబందిత ఎన్నికల అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినవారికి చర్యలు తీసుకోంటామని చెప్పారు.