ఇంకెన్నాళ్లీ వేధింపులు?
చెన్నై : ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందాల వ్యవహారంపై సాగిన దాడుల్లో కీలక రికార్డులు లభించినట్లు ఈడీ, ఐటీ వర్గాలు చెబుతుండగా, అదేమీ లేదంటూ కార్తీ చిదంబరం వ్యాఖ్యానించడం గమనార్హం! ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందం వెనుక అవినీతి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ వ్యవహారం కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం చుట్టూ పరిభ్రమిస్తోంది. గత నెల 30న ఆయన కార్యాలయాలు, ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు.
అయితే, మరో మారు బుధవారం దాడులు చేయడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో కార్తీ చిదంబరానికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయా? అనే కోణంలో సాగిన ఈ దాడుల్లో కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆదాయ పన్ను శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, తన కార్యాలయాల్లో ఏమీ స్వాధీనం చేసుకోలేదని కార్తీ చిదంబరం ఇప్పటికే స్పష్టం చేయగా, గురువారం మరో మారు అదే విషయాన్ని చెప్పారు.
తన సన్నిహితుల కార్యాలయాల్లో కూడా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదని వివరించారు. తనకు ఇతరుల సంస్థల్లో ఎలాంటి వాటాలు లేవని, తన మీద ఎయిర్‌సెల్, మాక్సీస్ ఒప్పంద వ్యవహారాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కార్తీ విమర్శించారు. ఈ వేధింపులెన్నాళ్లంటూ గురువారం చిదంబరం సైతం ఓ ప్రకటన లో ఘాటుగా స్పందించారు.
పాలకులు తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన కుమారుడి కార్యాలయంలో ఎలాంటి ఆధారాలు లభించ లేదని, ఇదే విషయాన్ని కార్తీ సైతం స్పష్టం చేశాడని గుర్తు చేశారు. అయితే, కార్తీకి వ్యతిరేకంగా ప్రయత్నాలు సాగుతున్న విషయం తేటతెల్లమవుతోందని పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.