విషాదం
లక్షలు కుమ్మరించినా తనయుడికి జబ్బు నయం కాలేదు. క్యాన్సర్ మహమ్మారితో తమ బిడ్డ అనుభవిస్తున్న నరకాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఇక బతుకు వద్దనుకున్నారు. తనయుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన తమిళనాడులోని వ్యాసార్పాడిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
సాక్షి, చెన్నై: వ్యాసార్పాడి గోపిఖాన్ వీధికి చెందిన కమల కణ్ణన్(54), గౌరి(48) దంపతుల తనయుడు సతీష్‌కుమార్(24). బతుకు తెరువు వెతుక్కుంటూ వచ్చిన కమల కణ్ణన్‌ను మద్రాసు నగరం ఆదరించింది. ఎంకేబీ నగర్‌లో ఓ జ్యూస్ షాపును నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. బిడ్డను బాగా చదివించాడు.
కొడుకు ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేదు. అయితే ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే సతీష్‌కుమార్ బోన్ క్యాన్సర్ బారిన పడడం ఆ కుటుంబాన్ని కలచి వేసింది. సతీష్‌కుమార్‌ను కాపాడుకునేందుకు కమలకణ్ణన్, గౌరి దంపతులు ఎంతో శ్రమించారు. చూపించని ఆస్పత్రి అంటూ లేదు. సుమారు రూ.20 లక్షల రూపాయలు కుమ్మరించినా ఫలితం కనిపించలేదు. తనయుడు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తుండడాన్ని చూస్తూ తల్లడిల్లారు. ఇక బతుకుపై ఆశ వదులుకున్నారు.
ఆత్మహత్య
కమల కణ్ణన్ శుక్రవారం రాత్రి దుకాణం మూసి ఇంటికి చేరుకున్నాడు. తనయుడు పడుతున్న బాధను చూసి తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. భార్య గౌరి, తనయుడు సతీష్‌తో మాట్లాడి ఇక ఈ బతుకు మనకొద్దు అన్న నిర్ణయానికి వచ్చేశారు. ముగ్గురు కలిసి వేర్వేరు నైలాన్ తాళ్లతో ఫ్యాన్‌కు ఉరి పోసుకుని చనిపోయూరు.
క్యాన్సర్ మింగేసింది
కమలకణ్ణన్ నివసిస్తున్న ప్రదేశానికి కూత వేటు దూరంలో ఆయన సోదరుడు రామకృష్ణ ఉంటున్నారు. అన్నయ్య ఇంటి వైపుగా రామకృష్ణ శనివారం ఉదయం వచ్చాడు. ఇంటి తలుపుకు గడియ పెట్టకుండా ఉండడంతో లోపలకు వెళ్లాడు. అక్కడ అన్న, వదిన, సతీష్‌లు ముగ్గురు ఉరి పోసుకుని వేలాడుతుండడంతో బోరున విలపించేశాడు. ఇంతలో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సెంబియం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో జరిపిన తనిఖీల్లో కమలకణ్ణన్ రాసి పెట్టిన లేఖ బయట పడింది. క్యాన్సర్ మహమ్మారితో తమ బిడ్డ అనుభవిస్తున్న నరకాన్ని చూసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణరుుంచుకున్నట్లు లేఖలో ఉంది.