
ప్రజల్లో ‘ర్యాట్’ ఫీవర్
చెన్నై : నగర వాసుల్లో ర్యాట్ ఫీవర్(లెప్టోస్పైరోసిస్) భయం పట్టుకుంది. ఈ జ్వరం క్రమంగా ప్రబలుతుండడంతో ఆందోళన పెరుగుతోంది. ప్రధానంగా పిల్లలు ఈ జ్వరం బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. రాజధాని నగరం వాసుల్ని తరచూ ఏదో ఒక జ్వరాలు పీడిస్తున్నాయి. తొలుత చికున్ గున్య, చికున్ ఫాక్స్ వణికించాయి. తదనంతరం స్వైన్ ఫ్లూ భయం ఆందోళన రేకెత్తించింది. ఇందు కోసం ప్రత్యేక వార్డుల్ని సైతం ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసి ఆ ఫ్లూను కాస్తా తరిమి కొట్టారు. అనంతరం డెంగీ, మలేరియా జ్వరాలు పీడించాయి. తాజాగా ర్యాట్ ఫీవర్ నగర వాసుల్ని పట్టిపీడిస్తోంది. ప్రధానంగా మురికి వాడల్లో ఈ జ్వరం తీవ్రత పెరుగుతున్నది.
ఐదేళ్ల క్రితం ఈ జ్వరం నగర వాసుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. కుటుంబాలు కుటుంబాలు ఆసుపత్రుల పాలు కావాల్సి వచ్చింది. తాజాగా మళ్లీ ఈ జ్వరం బారిన పడ్డ కేసులు నమోదు అవుతోండడంతో ఆసుపత్రుల్లో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. ఎక్కువ శాతం చిన్న పిల్లలు జ్వరంతో ఆసుపత్రుల్లో చేరుతున్నట్టుగా వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ క్లీనిక్, ఆసుపత్రులు చూసినా జ్వరంతో బాధ పడుతున్న వాళ్లే అధికంగా ఉన్నారు.
తీవ్ర తలనొప్పి, మూడు రోజులకు పైగా జ్వరం, వాంతుల తీవ్రత అధికంగా ఉంటే, తప్పని సరిగా రక్త పరీక్ష చేసుకుని ర్యాట్ ఫీవర్‌గా నిర్ధారించుకుని అందుకు తగ్గ వైద్యసేవల్ని పొందాలని వైద్యులు పేర్కొంటున్నారు. ఇళ్లల్లో ఎలుకలు ఉంటే, వాటిని తరిమి కొట్టాలని, మురికి వాడల్లో ఉండే వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ జ్వరం తీవ్రత పెరుగుతుండడంతో కార్పొరేషన్ వర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. మురికి వాడల్లో, కాలువల్లో బ్లీచింగ్ చేయడంతో పాటుగా ఎలుకల్ని నాశనం చేసే క్రిముల్ని చల్లేందుకు సిద్ధం అవుతున్నారు.