ప్రైవేటు స్కూళ్లు , కళాశాలల పరిసరాల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు అమర్చాల్సిందేనని నగర పోలీసు యంత్రాంగం హుకుం జారీ చేసింది. విద్యా సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ఆరంభం కానున్నది.
సాక్షి, చెన్నై : ప్రైవేటు స్కూళ్లు , కళాశాలల పరిసరాల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు అమర్చాల్సిందేనని నగర పోలీసు యంత్రాంగం హుకుం జారీ చేసింది. విద్యా సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ఆరంభం కానున్నది. విద్యార్థులకు భద్రత కల్పించే రీతిలో ఆయా విద్యా సంస్థలు తీసుకున్న చర్యలపై పరిశీలనకు పోలీసు యం త్రాంగం సిద్ధం అయింది. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలోని అన్ని విద్యా సంస్థల్లోనూ ఈ పరిశీలనకు కమిషనర్ జార్జ్ ఆదేశాలు ఇచ్చారు. అదనపు కమిషనర్ కరుణా సాగర్ పర్యవేక్షణలో ఆయా డివిజన్లలోని డెప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్ల నేతృత్వంలో విద్యాసంస్థల్లో పరిశీలన ప్రక్రియ ఆదివారం నుంచి ఆరంభమైంది. ఆ ఆయా స్కూల్స్, కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగ, సిబ్బంది, డ్రైవర్లు, వాచ్‌మన్లు, సెక్యూరిటీల ఫొటోలు, చిరునామాలతో కూడిన వివరాలు సేకరించి పెట్టుకోవాలని, ఆయా పరిధిలోని పోలీసు స్టేషన్ల నెంబర్లు, అధికారుల సెల్ నెంబర్లు తప్పనిసరిగా నోటీసు బోర్డుల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోమారు తాము పరిశీలనకు వచ్చేలోపు నిఘా నేత్రాలు, తాము సూచించిన అన్ని అంశాలను పూర్తి చేసి ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.