ఆంగారక సంకష్టిని పురస్కరించుకుని ప్రభాదేవిలోని సిద్ధివినాయక మందిరం, పక్కనున్న మైదానంలో ఏర్పాట్లు చేశారు.
సాక్షి, ముంబై: ఆంగారక సంకష్టిని పురస్కరించుకుని ప్రభాదేవిలోని సిద్ధివినాయక మందిరం, పక్కనున్న మైదానంలో ఏర్పాట్లు చేశారు. మంగళవారం సంకష్టి కావడంతో సోమవారం అర్థరాత్రి నుంచి నిరంతరాయంగా వినాయకున్ని దర్శించుకునేందు కుభక్తులకు సౌకర్యం కల్పించనున్నారు.
సోమవారం మధ్యాహ్నం నుంచి భక్తులు క్యూలో నిలబడటం మొదలుపెడతారు. భక్తుల రద్దీని దృష్టి లో ఉంచుకుని 50 మంది పోలీసు అధికారులు, 915 కానిస్టేబుళ్లు, నాలుగు స్టేట్ రిజర్వుడు పోలీసు (ఎస్‌ఆర్పీ) కంపెనీలను మోహరించనున్నట్లు నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ ధనంజయ్ కులకర్ణి తెలిపారు. ఈసారీ అంగారకి సంకష్టి మంగళవారం రావడంతో సుమారు 15-20 లక్షల మంది భక్తులు వినాయకున్ని దర్శించుకునే అవకాశాలున్నాయని సిద్ధివినాయక ఆలయట్రస్టు అధ్యక్షుడు సుభాష్ మయేకర్ చెప్పారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడులను దృష్టిలో ఉంచుకుని అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా వేయనున్నామన్నారు. అనుమానిత వస్తువులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని మయేకర్, కులకర్ణి సూచించారు. ఆలయ పరిసరాల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనం, వైద్య బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. రద్దీ కారణంగా ఆలయానికి ఆనుకున్న ఉన్న వివిధ రహదారులపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.
దర్శన వేళలు...
సోమవారం రాత్రి గం.8.46 ని.లకు చంద్రోదయం తర్వాత అర్ధరాత్రి గం.1.30 ని.లకు భక్తులను అనుమతిస్తారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు క్యూ పూర్తవుతుంది.
మంగళవారం రాత్రి గం.7.45 ని.ల నుంచి గం.9.15 ని. వరకు ప్రధాన గర్భగుడి బయట వివిధ ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి.
దూరం నుంచి (ముఖ్ దర్శన్) దర్శించుకునే వారికి సోమవారం అర్ధరాత్రి 1.30 నుంచి ప్రవేశద్వారం నంబరు-5 నుంచి అనుమతి కల్పిస్తారు.
వికలాంగులకు, గర్భిణులకు, పాస్ హోల్డర్లకు, పిల్లల తల్లులకు సానే గురూజీ మైదాన్ నుంచి ప్రత్యేక క్యూలో పంపిస్తారు.
సోమవారం అర్థరాత్రి 12.10-1.30 వరకు కాకడ్ హారతి, మహాపూజ.
తెల్లవారుజాము 3.15-3.50 వరకు, మళ్లీ సాయంత్రం 7.15 హారతి ఉంటుంది.