ఎమ్మెల్సీ పొంగులేటి
కొరుక్కుపేట: తెలుగు భాషపై తమిళనాడు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించటం సరైన పద్ధతి కాదని తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాతృభాషను వదలి తమిళంలో చదవాలనే నిర్ణయం గొడ్డలి పెట్టులాంటిదని దుయ్యబట్టారు. ఎన్నో దశాబ్దాలు తరబడి తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిని తక్కువ చేసి చూడడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని తమిళనాట తెలుగు భాషా సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తిపరిష్కారం దిశగా కృషి చేస్తామని ఆయన అన్నారు.
నిర్బంధ తమిళం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అల్పసంఖ్యాకుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కనీసం 10 సంవత్సరాలు పాటు అవకాశం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాష్ట్రంలోని మైనారిటీ భాషలన్నింటికీ ఆయన తన సంఘీభావాన్ని తెలిపారు.