నగరంలో హైఅలర్ట్
Published Sat, Jan 4 2014 11:03 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించడంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. 26/11 తరహాలో ఢిల్లీలోని మెట్రోస్టేషన్లపై ముష్కరులు దాడులు చేయొచ్చని మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి పోలీసుశాఖకు సమాచారం అందింది. దీంతో నగరంలోని అన్ని మెట్రోస్టేషన్లు, రద్దీమార్కెట్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వీటితోపాటు రాత్రి వేళల్లో గస్తీ సైతం పెంచారు. ఈ విషయాన్ని నగర పోలీసు శాఖ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. ఈ నెల పదో తేదీలోగా ఎప్పుడైనా ఉగ్రదాడులు జరగొచ్చంటూ నిఘావర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
గణతంత్ర వేడుకల నేపథ్యంలో సాధారణంగానే అదనపు భద్రత కనిపించే మధ్యఢిల్లీ పరిసరాల్లో ప్రస్తుతం సాయుధ బలగాలు పెద్దసంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి మెట్రో రైలు స్టేషన్లలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సంఖ్యను మరింత పెంచారు. ఆయా స్టేషన్లలోకి వచ్చేవారి కదలికలను గమనించడంతోపాటు వారు తెచ్చే వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించారు. మెట్రోస్టేషన్లలో భద్రతా సిబ్బందిని దాదాపు రెట్టింపు చేశామని సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్ కీలక సభ్యుడైన యాసిన్ భత్కల్‌ను విడుదల చేయించుకునేందుకు ఉగ్రవాదులు హైజాక్‌లకు సైతం పాల్పడే అవకాశం ఉన్నట్టు మిలిటరీ ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. కీలక ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో క్విక్ రియాక్షన్ టీంలు, బాంబు నిర్వీర్య స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సైతం అందుబాటులో ఉంచేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న సీసీటీవీ కెమెరాలద్వారా అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
Advertisement