హోదా కోసం కాంగ్రెస్, ఎన్సీపీ హోరాహోరీ
సాక్షి, ముంబై: ప్రతిపక్ష హోదా దక్కించుకునే విషయపై కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మధ్య రాజుకున్న వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రతిపక్షంలో కొనసాగాలి. కాని ఇరు కాంగ్రెస్ పార్టీల మధ్య కేవలం ఒకే సభ్యుడి తేడా ఉంది. దీంతో తమకు ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో ప్రతిపక్షంలో తామే కొనసాగుతామని ఎన్సీపీ కూడా పట్టుబడుతోంది. శీతాకాల సమావేశాలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న శివసేన సమావేశాలకు రెండు రోజుల ముందు బీజేపీతో చేతులు కలిపి అధికారపక్షంలోకి మారడంతో ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్,ఎన్సీపీలు పోటీపడసాగాయి.
15 యేళ్లుగా (మూడు పర్యాయాలు) కూటమిగా కొనసాగుతూ రాష్ట్రాన్ని ఏలిన ఇరు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రతిపక్షం పదవి కోసం బద్ధ శత్రువులుగా మారారు. ఎడముఖం, పెడముఖం కారణంగా నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఇరు పార్టీల నాయకుల మధ్య సమన్వయం కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడసికొడుతున్నాయి. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కాకుండా ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. విధాన్ పరిషత్ సభాపతి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ఎన్సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీంతో ఎన్సీపీ వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పరిస్ధితులు ఇలాగే కొనసాగితే ఇరు కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం మరింత ముదిరే ప్రమాదం ఉంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ (122) మొదటి స్థానంలో ఉండగా శివసేన(3) రెండో స్థానంలో నిలిచింది. కాని బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇతర పార్టీల సాయం తీసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఎన్సీపీ బయటనుంచి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. మొదట కాంగ్రెస్ మినహా ఎవరి మద్దతునైనా స్వీకరిస్తామని ప్రకటించిన బీజేపీ, తర్వాత ఎన్సీపీ మద్దతు తీసుకునేందుకు తటపటాయించింది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీపై పలు విమర్శలు చేసిన ఎన్సీపీ మద్దతు ఎలా తీసుకుంటారని బహిరంగంగానే బీజేపీపై పలువురు ఆరోపణలు గుప్పించారు.
దాంతో ఆ పార్టీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం శివసేనతో మంతనాలు జరిపినప్పటికీ పదవులపై రెండు పార్టీల మధ్య రాజీ కుదరకపోవడంతో చివరకు శివసేన ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే భావసారూప్యంగల బీజేపీ, శివసేన జతకడితేనే ప్రభుత్వం సుదీర్ఘకాలం నిలబడే అవకాశం ఉంటుందని ఆర్‌ఎస్‌ఎస్ సహా పలు హిందూత్వ వర్గాలు సూచించడంతో ఆ రెండు పార్టీలు శీతాకాల సమావేశాలకు ముందు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి స్పీకర్‌కు ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రస్తుతం శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష పార్టీ లేకుండానే కొనసాగుతుండటం గమనార్హం.
‘ప్రతిపక్షం’పై సిగపట్లు!
Published Mon, Dec 15 2014 10:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement