శాండల్‌వుడ్ నటుడు రఘువీర్ కన్నుమూత...
సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ రంగంలో 22ఏళ్ల పాటు ప్రయాణాన్ని సాగించిన నటుడు రఘువీర్(46) మృతిచెందారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. అజయ్-విజయ్ చిత్రంతో శాండిల్‌వుడ్‌కు పరిచయమైన రఘువీర్ అసలు పేరు దినేష్. చైత్రద ప్రేమాంజలి సినిమా ఆయనకు మంచి నటుడిగా పేరు తెచ్చింది. ‘శృంగార కావ్య’ సినిమాలో తనతో పాటే నటించిన హీరోయిన్ సింధును రఘువీర్ వివాహమాడారు.
ఈ వివాహం రఘువీర్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో కుటుంబానికి ఆయన దూరమయ్యారు. వివాహమైన కొన్ని సంవత్సరాలకు అనారోగ్య కారణంగా భార్య సింధు మరణించడంతో మానసికంగా కుంగిపోయిన రఘువీర్ చాలా కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇటీవల తిరిగి వచ్చి కావేరీ తీరదల్లి, నవిలూర నైదిల, మౌన సంగ్రామ వంటి సినిమాలు చేసినా అవి నిరాశనే మిగిల్చాయి.
గురువారం రాత్రి తన స్నేహితులు, పిల్లలతో కలిసి ఎస్టేట్‌కి వెళుతున్న సమయంలో ఉన్నపళంగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తక్షణమే ఆయన్ను బీటీఎం లేఅవుట్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినా చికిత్స ఫలించక తనువు చాలించారు. సంపంగి రామనగరలోని రఘువీర్ నివాసంలో ప్రజల సందర్శనార్ధం పార్ధివ దేహాన్ని ఉంచారు.
నటీనటులు శోభరాజ్, లీలావతి, వినోద్‌రాజ్, కె.మంజు, జగ్గేష్ తదితరులు రఘువీర్ పార్ధివ శరీరానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం విల్సన్ గార్డెన్ స్మశాన వాటికలో రఘువీర్ అంత్యక్రియలు పూర్తిచేశారు. రఘువీర్ కుటుంబానికి రూ1.75లక్షల ధన సహాయాన్ని అందించనున్నట్లు కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి వెల్లడించింది.