బీరు తాగిన అమ్మాయిలకు టీసీలు
చెన్నై: పట్టపగలు.. క్లాస్ రూంలో నలుగురు అమ్మాయిలు కలిసి బీరు కొడతారని ఎప్పుడైనా ఊహించారా? ఆ స్కూలు యాజమాన్యం కూడా ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. విషయం తెలియగానే ముందు షాకైనా.. తర్వాత ఆ నలుగురికీ టీసీలు ఇచ్చి ఇంటికి పంపేశారు. ఇదేదో కార్పొరేట్ స్కూల్లో.. బాగా డబ్బున్న ఆసాముల పిల్లలు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. తమిళనాడు నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్‌లో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వ్యవహారమిది. వీళ్లంతా 11వ తరగతి (జూనియర్ ఇంటర్) చదువుతున్నారు. చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్. గోపీదాస్ ఆదేశాలతో వీళ్లకు టీసీలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
క్లాసులో నలుగురు అమ్మాయిలు తాగిన మత్తులో ఉన్నట్లు క్లాస్ టీచర్ గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆమె ప్రధానోపాధ్యాయురాలికి చెప్పగా, వాళ్లను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ.. ఆ నలుగురూ మద్యం తాగినట్లు నిర్ధారణ అయ్యింది. స్నేహితురాలి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోడానికి మొత్తం ఏడుగురు విద్యార్థినులు ఆ రోజు స్కూలుకు వచ్చారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కూల్ డ్రింకు బాటిళ్లలో బీరు నింపుకొని తీసుకొచ్చారు. అయితే, తర్వాత వాళ్లలో ముగ్గురు భయపడి.. తాగలేదు. మిగిలిన నలుగురూ తాగడంతో.. వాళ్లకు మాత్రం టీసీలు ఇచ్చి పంపేశారు.