
భద్రత కట్టుదిట్టం
ఉగ్రవాదుల దాడుల సమాచారంతో నిఘా ముమ్మరం
అంతర్జాతీయ విమానాశ్రయంలో అదనపు బలగాల మోహరింపు
ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో భారీ భద్రత
బెంగళూరు: శివరాత్రి పర్వదినం సందర్భంలో దేశంలో విధ్వంసాన్ని సృష్టించడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు దేశంలోని అన్ని ప్రముఖ ప్రాంతాలు, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగానే కర్ణాటక వ్యాప్తంగా, బెంగళూరులో సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదనపు పోలీసు బలగాలను మోహరించిన అధికారులు ప్రతి ఒక్కరి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాధారణ భద్రతతో పోలిస్తే దాదాపు రెట్టింపు పోలీసు బలగాలను, రిజర్వు బలగాలను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మోహరించారు. ఇదే సందర్భంలో విమానాశ్రయానికి చేరుకుంటున్న వాహనాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించన తర్వాతే పోలీసులు అనుమతిస్తున్నారు. మొత్తం మూడు దశల్లో వాహనాల తనిఖీ జరుగుతోందంటే భద్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విమానాశ్రయానికి చేరుకుంటున్న ప్రయాణికులు, విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న వారు ఇలా ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక బెంగళూరులోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఆలయాల వద్ద సైతం అదనపు భద్రతా బలగాలను మోహరించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల సంఖ్య అధికంగా ఉండే ఆలయాల వద్ద కూడా పోలీసుల పహారా కనిపించింది. ఇక ఉగ్రవాదులు జనసందోహం అధికంగా ఉండే ప్రాంతాల్లో దాడులకు తెగబడవచ్చుననే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాల వద్ద కూడా అదనపు బలగాలను మోహరించారు.