ఏదీ జలకళ?
- ముంచుకొస్తున్న కరువు
- తాత్కాలిక ప్రణాళికతో సర్కారు సిద్ధం
- దీర్ఘకాలిక పంటల సాగు వద్దు : మంత్రి కృష్ణ బైరేగౌడ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో నైరుతి రుతు పవనాల జాడ లేకపోవడం, జూన్ ముగియనున్న తరుణంలో కూడా వేసవిని తలపిస్తుండడంతో జలాశయాలన్నీ ఖాళీ అవుతున్నాయి. కృష్ణా నదిపై బీజాపుర జిల్లాలో నిర్మించిన ఆల్మట్టి జలాశయంలో నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. ఈ దశలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రుతు పవనాలు విఫలమైతే రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తాత్కాలిక ప్రణాళికతో సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ గురువారం శాసన సభలో ప్రకటించారు.
జులై తొలి వారం వరకు వేచి చూసి, తదనంతరం ఇదే పరిస్థితి కొనసాగితే ఆ ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. రుతు పవనాలు ఒక్కో సారి జులైలో కూడా చురుకుగా కదిలిన అనుభవాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారని వెల్లడించారు. అప్పటికీ నైరుతి జాడ లేకపోతే ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. ఈ ప్రణాళిక కింద ప్రతి రైతుకు రూ.3 వేల విలువైన కిట్లను అందజేస్తామని చెప్పారు. ఇందులో స్వల్ప, మధ్య కాలిక పంటలను పండించడానికి విత్తనాలు, ఎరువులు ఉంటాయని వివరించారు.
తాత్కాలిక ప్రణాళిక కింద దీర్ఘకాలిక పంటలు వేయవద్దని రైతులకు సూచిస్తామని తెలిపారు. ఒక వేళ కరువు లాంటి పరిస్థితి ఏర్పడినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. రాష్ర్టంలోని 176కు గాను 21 తాలూకాల్లో అధిక, 72 తాలూకాల్లో సాధారణ, 73 తాలూకాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని వివరించారు. పది తాలూకాల్లో చెదురు మదురు వర్షాలు పడ్డాయన్నారు. గత ఏడాది ఇదే కాలానికి 81 తాలూకాల్లో అధిక, 66 తాలూకాల్లో సాధారణ, 29 తాలూకాల్లో తక్కువ వర్షపాతనం నమోదైందని వెల్లడించారు.
రూ.146 కోట్లతో రైతులకు వ్యవసాయ పనిముట్లు
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.146 కోట్ల వ్యయంతో వ్యవసాయ యాంత్రిక పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తద్వారా ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ ఉపకరణాలు, పనిముట్లను రైతులు అద్దె ప్రాతిపదికన తీసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రెండేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు.