టూల్‌ పట్టిన క్రికెట్ దేవుడు | Soon you can own a 'Sachin Tendulkar Edition' BMW | Sakshi
Sakshi News home page

టూల్‌ పట్టిన క్రికెట్ దేవుడు

Published Fri, May 8 2015 9:12 AM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

టూల్‌ పట్టిన క్రికెట్ దేవుడు - Sakshi

క్రికెట్ దేవుడు అంటూ క్రీడాభిమానుల చేత కీర్తిప్రతిష్టలు అందుకున్న సచిన్ టెండూల్కర్ చెన్నైలో గురువారం చిత్రమైన రీతిలో సందడి చేశారు. క్రికెట్ బ్యాట్ పట్టిన చేత్తో టూల్స్ పట్టుకుని బీఎండబ్ల్యూ కారు ఇంజిన్‌ను బిగించారు.సుమారు గంటన్నరపాటు తన చిత్ర విచిత్రమైన విన్యాసాలతో  అబ్బురపరిచారు
 
ప్రసిద్ధ బీఎండబ్ల్యూ కార్ల సంస్థ చెన్నై శివార్లలోని కార్ల ప్లాంట్‌కు సచిన్ టెండూల్కర్‌ను ఆహ్వానించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కారు ప్లాంట్‌కు చేరుకున్న సచిన్‌ను కంపెనీ ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్‌సహర్, మేనేజింగ్ డెరైక్టర్ రాబర్ట్ ఫ్రిట్టరాంగ్ ఆహ్వానం పలికారు.
 
 టెక్నీషియన్ సచిన్
 కారును బిగించేందుకు ముందుకు వచ్చినందుకు ఎంతో సంతోషం, అయితే అసలు ఈ కారులో ఎన్ని విడిభాగాలు ఉన్నాయో తెలుసా అని ఎండీ ప్రశ్నించారు. తెలియకేం, ఇక్కడకు వచ్చేముందు రాత్రంతా స్టడీ చేశాను..మొత్తం 2800 కాంపొనెంట్స్ ఉన్నాయని సచిన్ బదులివ్వగా, కరెక్ట్ అని ఎండీ మెచ్చుకున్నారు. ఆ తరువాత సమీపంలోని ఒక ట్రాలీలో సిద్ధంగా ఉన్న కారు ఇంజిన్‌భాగాన్ని సచిన్ తోసుకుంటూ వచ్చారు. పైభాగాన వేలాడుతున్న కారు క్రేన్ సహాయంతో కిందుకు రాగానే సచిన్ సహా అందరూ ఇంజన్‌ను లోన కూర్చోబెట్టారు. స్క్రూడ్రైవర్లు, మిషన్‌తో బోల్టులను బిగించే భారీ పనిముట్ల సహాయంతో ఇంజన్‌ను బిగించారు.

 

ఆ తరువాత ముందువైపు టైరు బిగించే ప్రదేశంలో ఇంజన్ సరిగా కూర్చుందాని తనిఖీ చేసి పనిముగించారు. కారు ఇంజిన్‌ను బిగించడంలో తనకు శిక్షణ నిచ్చిన వెంకట్, నరేష్, ఇస్మాయిల్‌లను పిలిచి అభినందించారు. బీఎండడ్ల్యూ కార్ల ప్లాంట్ సిబ్బంది, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు సమక్షంలో ఒక సామాన్య టెక్నీషియన్‌గా సుమారు అరగంటపాటూ సచిన్ శ్రమించడం అందరినీ అబ్బురపరిచింది.
 
 మీడియా ప్రతినిధిగా సచిన్
 టెక్నీషియన్‌గా అవతారం చాలించిన సచిన్ మీడియా ప్రతి నిధిగా సంస్థ ఎండీకి ఒక ప్రశ్నను సంధించారు. క్రికెటర్‌గా తాను అనేక దేశాల్లో ఈ కంపెనీ కార్లను చూశాను, నేడు 50 శాతం చెన్నై ప్లాంట్‌లోనే తయారవుతోందని అంటున్నారు, నాణ్యతా ప్రమాణాల్లో అక్కడి కార్లకు, భారతీయ తయారీకి ఏమైనా తేడా ఉందాని ప్రశ్నించారు. భారతీయమైన, విదేశమైనా నాణ్యతా ప్రమాణాల్లో సమభావం ప్రదర్శిస్తున్నామ ని, ఇందులో ఎటువంటి రాజీ లేదని ఎండీ స్పష్టం చేశారు.
 
 బీఎండబ్ల్యూ నా డ్రీమ్ కారు
 చిన్ననాటి నుండి అభిమానిస్తూ గమనిస్తున్న  బీఎండబ్ల్యూ తన కలల కారుగా సచిన్ అభివర్ణించారు. నేడు అదే కారు ప్లాంట్‌కు తనను ఆహ్వానించడం జీవితంలో తనకు లభించిన గొప్ప బహుమతిగా భావిస్తున్నానని అన్నారు. ఈ ప్లాంట్‌లో గడిపిన క్షణాలు ఒక మధురమైన అనుభూతి అన్నారు. ప్రపంచంలోనే ఇది సూపర్‌క్లాస్ కారు అని సచిన్ వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన అనంతరం పది నిమిషాలపాటు కారు ముందు ఫోటోకు ఫోజులిచ్చారు.
 -చెన్నై,సాక్షి ప్రతినిధి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement