- 6 నెలల్లోగా ఏర్పాటు చేస్తామన్న
- సెంట్రల్ రైల్వే
- ‘ఉగ్ర’ హెచ్చరికల నేపథ్యంలోనే..
- త్వరలో డాగ్స్ కెన్నల్‌ల నిర్మాణం
సాక్షి, ముంబై: నగరంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చన్న నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన కమాండోలతో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఉగ్రదాడులు జరగే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, మరో ఆరు నెలల్లో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. కమాండోలను ఏర్పాటు చేయటం వల్ల టెర్మినస్ భద్రతా వలయంలో ఉంటుందని సెంట్రల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ అశోక్ భోర తెలిపారు. ప్రస్తుతం ఆర్పీఎఫ్‌కు ప్రత్యేకంగా 50 మంది సిబ్బంది ఉండగా..
మరో 60 మంది సిబ్బంది అదనంగా చేరనున్నారు. వారిని కొత్తగా ఇటీవల ఫోర్స్‌లో చేరినృబందంతో కలిపి విపత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తారు. ఇందుకు అత్యాధునిక ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నేర్పుతారు. వీరికి తోడుగా డాగ్ స్క్వాడ్‌ల కోసం సెంట్రల్ రైల్వే కొత్తగా కెన్నల్‌లను నిర్మించనుంది. పన్వేల్, కసారా, లోనావాలాలోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మిస్తుంది. నగర శివార్లలో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, అక్కడ కూడా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ రైల్వే కమిషనర్ అశోక్ తెలిపారు.
ప్రస్తుతం కార్నక్ బందర్, లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్‌టీటీ), మాటుంగ, కల్యాణ్‌లలో 29 స్నిఫర్ డాగ్స్‌కు గాను 37 కెన్నీస్‌లు ఉన్నాయని చెప్పారు. కొత్త డాగ్స్ షెల్టర్లు అందుబాటులోకి రాగానే మరిన్నింటిని సమకూర్చే ప్రయత్నం చేస్తామని వివరించారు. అలాగే ఎలక్ట్రానిక్ నిఘాను కూడా మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. కుర్లా స్టేషన్‌లో ఇంటిగ్రెటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (ఐఎస్‌ఎస్)లో భాగంగా దాదాపు వంద కెమెరాలను అమర్చనున్నామని చెప్పారు.
అనంతరం ఎల్‌టీటీ, కల్యాణ్‌లలో కూడా హై-ఎన్డ్ కెమెరాలను అమర్చుతామన్నారు. సీఎస్టీ, థానేలో ఐఎస్‌ఎస్ లో భాగంగా కెమెరాలను అమర్చారని, ఈ నెలాఖరుకు దాదర్‌లో కంట్రోల్ రూం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలను ఎదుర్కొవడానికి సిబ్బందికి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని, సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు తగినంత సిబ్బంది ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.
‘సీఎస్టీ’కి కమాండో భద్రత
Published Sun, May 3 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM
Advertisement