కలియుగ విచిత్రాల జాబితాలో మరొకటి చోటుచేసుకుంది. ఏడాది పాప గర్భంతో ఉన్న చిత్రమైన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో వెలుగు చూసింది. కోయంబత్తూరు జిల్లా పులియంపట్టికి చెందిన రాజు, సుమతి దంపతులకు నిశా అనే ఏడాది పాప ఉంది. ఇటీవల పాప పొట్ట విపరీతంగా పెరిగిపోవడం ప్రారంభించింది. దీంతో భయాందోళనలకు లోనైన తల్లిదండ్రులు చికిత్స కోసం మేట్టుపాళయంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పొట్టను స్కాన్ తీసి పరిశీలించిన వైద్యులు పాప కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్నట్లు గుర్తించి బిత్తరపోయారు.
అలాగే లివర్, పిత్తాశయం వేర్వేరు చోట్ల ఉండడాన్ని గమనించారు. ఆలస్యం చేస్తే బిడ్డ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని భావించిన వైద్యుల బృందం వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రెండుగంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. పాప కడుపులో నుంచి మూడు కిలోల పిండాన్ని తొలగించారు. ఆ పిండానికి అప్పటికే జుట్టు, కొన్ని ఎముకలు ఏర్పడి ఉన్నాయని డాక్టర్ విజయగిరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాప ఆరోగ్యంగా కోలుకుంటోందని తెలిపారు. పాప తల్లి గర్భవతిగా ఉన్నపుడు రెండు పిండాలు ఏర్పడి ఉంటాయని, వాటిల్లో ఒకటి ఈ పాపకాగా, మరో పిండం ఇదే పాప కడుపులోకి చేరి పెరగడం ప్రారంభించిందని తెలిపారు. పది లక్షల్లో ఒకటి ఇలాంటి కేసు ఉంటుందని చెప్పారు.