- రైతును తొక్కి చంపి వేసిన ఏనుగుల మంద
- రైతు మృతదేహంతో అటవీశాఖ కార్యాలయం వద్ద గ్రామస్తుల ఆందోళన
- ఫర్నీచర్ ధ్వంసం
హొసూరు: క్రిష్ణగిరి జిల్లాలో గజ సమూహం బీభత్సం సృష్టించింది. దాదాపు 30 ఏనుగులు పంటలను తొక్కి ధ్వంసం చేయడంతోపాటు మునియప్పన్ కొటాయ్ గ్రామానికి చెందిన రైతును పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటనను జీర్ణించుకోలేని రైతులు అటవీ శాఖ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. క్రిష్ణగిరి తాలూకా, మహారాజగడ ప్రాంతంలో సంచరిస్తున్న గజరాజులు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుంపులుగా విడిపోయాయి. ఓ మంద మునియప్పన్ కొటాయ్ గ్రామం వద్దకు చేరుకున్నాయి. దీంతో గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.
అనంతరం ఏనుగులు పొలాల్లోకి చొరబడి టమాట, రాగి, వరి, పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో రైతులు దివిటీలు వెలిగించి, టపాకాయలు పేల్చి ఏనుగులను తరిమేందుకు ప్రయత్నించగా తిరగబడ్డాయి. ఈ క్రమంలో పారిపోయేందుకు యత్నించి విఫలమైన మునియప్పన్‌కొటాయ్ గ్రామానికి చెందిన చిన్నపయ్యన్ (55)ను ఏనుగులు తొక్కివేసి వెళ్లిపోయాయి. రాత్రి 10.30 గంటలకు రైతులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా చిన్నప్పయ్యన్ విగతజీవిగా కనిపించాడు.
ఎనుగుల దాడులను అరికట్టడంలో అటవీఅధికారులు విఫలం చెందినందువల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపిస్తూ రైతులు దాదాపు 300 మంది క్రిష్ణగిరి -కుప్పం రహదారి పక్కన ఉన్న అటవీశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి చిన్నప్పయ్యన్ మృతదేహంతో ఆందోళనకు పూనుకున్నారు. కార్యాలయ తాళాలు పగులగొట్టి లోపలకు చొరబడి కుర్చీలు, బల్లలు ధ్వంసం చేశారు.
సంఘటనా స్థలానికి చేరుకొన్నిష్ణగిరి ఆర్‌డీఓ శాంతి, క్రిష్ణగిరి డీఎస్పీ రాజేంద్రన్, సీఐలు శేఖర్, తంగవేలు వారితో చర్చించి ఆందోళనను విరమింప చేశారు. తర్వాత రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.