ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని ఆప్ సొంత చేసుకుంది. 1993 నుంచి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నా ఇప్పటిదాకా ఇలా పూర్తి ఏకపక్షంగా ఓటరు తీర్పు ఇవ్వలేదు. దేశంలో ఒక పార్టీ ఇలా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి కొన్ని విజయాలను చూస్తే...
⇒ 2009లో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ మొత్తం 32 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 2004లో 31 స్థానాలను నెగ్గింది. 1994 నుంచి ఇప్పటిదాకా ప్రతీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఆ పార్టీ తరఫున పవన్ చామ్లింగ్ సీఎంగా కొనసాగుతున్నారు. గతేడాది జూన్‌లో జరిగిన ఎన్నికల్లో 22 స్థానాల్లో నెగ్గి వరుసగా ఆరోసారి ఆయన సీఎం పీఠం అధిష్టించారు.
⇒ 2010లో బిహార్ అసెంబ్లీ పోరులో జేడీయూ-బీజేపీ కూటమి 243 స్థానాలకుగాను 206 సీట్లలో గెలిచింది.
⇒ 1991లో తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే-కాంగ్రెస్ కూటమి 234 సీట్లకుగాను 225 సీట్లలో నెగ్గింది. జయలలిత తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో కరుణానిధికి చెందిన డీఎంకే కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకుంది.
⇒ 1996లో తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 234 స్థానాలకుగాను 221 సీట్లలో విజయ ఢంకా మోగించింది. ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత కూడా ఓడిపోయారు.
⇒ 1989లో సిక్కింలో సిక్కిం సంగ్రామ్ పార్టీ మొత్తం 32 స్థానాల్లో నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ పార్టీని 1984లో నర్ బహదూర్ భండారీ స్థాపించారు.
ఎన్నికల చరిత్రలో అరుదైన విజయాలు..
Published Wed, Feb 11 2015 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM
Advertisement
Advertisement