
మా సింధు బంగారం
రజతంతో దేశ ప్రజల హృదయాల్ని గెలుచుకుని, రియో ఒలింపిక్స్‌లో ఆ పథకం గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన సింధుకు తమిళనాట అభినందనలు వెల్లువెత్తాయి.
రజతంతో దేశ ప్రజల హృదయాల్ని గెలుచుకుని, రియో ఒలింపిక్స్‌లో ఆ పథకం గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన సింధుకు తమిళనాట అభినందనలు వెల్లువెత్తాయి. ఇక కాంస్యంతో అదరహో అనిపించిన సాక్షి మాలిక్‌కూ ప్రశంసలు అందుతున్నాయి.
సాక్షి, చెన్నై: రియో ఒలింపిక్స్‌లో పతకంపై భారత్ ఆశలు వదులుకుంటున్న సమయంలో ఇద్దరు భారతావనితలు మెరిశారు. తమ సత్తాను చాటి ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్‌కు చోటు కల్పించడంతో పాటు చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగారు. ఇందులో ప్రథమంగా భారత ఖ్యాతిని చాటే విధంగా బ్యాడ్మింటన్‌లో రాకెట్ వేగంతో చరిత్ర కెక్కిన షట్లర్ సింధు వీరోచిత శ్రమ యా వత్ భారతావని హృదయాల్ని తాకింది. అలా గే, రెజ్లింగ్‌లో కంచుమోత మోగించిన సాక్షి మా లిక్ ఆట తీరు ప్రశంసల జల్లుల్ని కురిపించింది. క్రీడాభిమానుల్లో ఆనందాన్ని నింపుతూ, దేశ ఖ్యాతిని చాటిన ఆ ఇద్దరికి తమిళనాట అభినందనలు వెల్లువెత్తాయి.
తమిళనాడు సీఎం జయలలిత సింధు కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, కాంస్యంతో సత్తా చాటిన సాక్షిని ప్రశంసించారు. భారత దేశంలోని క్రీడాకారుల్లో ఈ ఇద్దరూ ఉద్వేగాన్ని నింపారని వ్యాఖ్యానించారు. యువతులందరికీ ఈ ఇద్దరు ఆదర్శంగా కొనియాడారు. కఠోర శ్రమ, ఆ ఇద్దర్నీ ఉన్నత స్థితికి చేర్చిందనిపేర్కొంటూ, వారికి శిక్షణ అందించిన కోచ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. సింధు ఆట తీరును ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె తల్లిదండ్రులను ప్రశంసించారు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి తన సందేశంలో అన్నీ పోటీల్లో విజయం లక్ష్యంగా సింధు ప్రదర్శించిన ఆట తీరు అమోఘం అని అభినందించారు.
బంగారం కోసం ఆమె వీరోచితంగా శ్రమించారని, ఫైనల్ మ్యాచ్‌ను చూసిన తానే ఉత్కంఠకు గురైనట్టు పేర్కొన్నారు. ఆత్మస్థయిర్యంతో చివరి మ్యాచ్‌లో ముందుకు సాగి ఓడినా, చరిత్ర సృష్టించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యతులో ఆమె మరింత ఉన్నత స్థితికి చేరుతారని ఆకాంక్షించారు. ఇక, సాక్షికి తన ప్రత్యేక అభినందనలు తెలుపుకున్నారు. పీఎంకే యువజన నేత అన్భుమణి రాందాసు పేర్కొంటూ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో సింధు ప్రతి భను చూస్తుంటే, భవిష్యత్తులో ఆమె మరెన్నో పతకాలను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. భారత క్రీడాకారులు భవిష్యత్తులో సింధును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ పేర్కొంటూ సింధు ప్రతిభ అపారం అని, అందరికీ ఇప్పుడు ఆదర్శవంతురాలిగా అవతరించారని వ్యాఖ్యానించారు. ఇక, డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్‌లతో పాటు పలువురు నేతలు తమ అభినందనలు తెలియజేశారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్ అయితే, ఈ ఆటతో సింధుకు వీరాభిమానిగా మారారు. అదే బాటలో ఆయన అల్లుడు, నటుడు ధనుష్ కూడా స్పందించడం విశేషం.