న్యూఢిల్లీ: సుమారు ఏడు లక్షల మంది భారత సైనికులు పాల్గొన్న మొదటి ప్రపంచయుద్ధంపై సోమవారం నగరంలో ప్రదర్శన ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగనున్న ఈ ప్రదర్శనను సాంస్కృతిక శాఖ కార్యదర్శి రవీందర్ సింగ్ ప్రారంభించారు. వందేళ్ల కిందట జరిగిన ఈ ప్రపంచ యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఫొటోగ్రాఫ్‌లు, వీడియోలతో పాటు భారత జవాన్లు ఉపయోగించిన యూనిఫాంలు, కోట్లు, ఫ్లాస్క్‌లు, మ్యాప్ కేస్‌లు, కత్తులు, సిగరెట్ ప్యాక్‌లు, బిస్కెట్లు ఇతర తినుబండారాలను ప్యాక్‌చేసిన కార్డ్‌బోర్డులు, ప్రథమ చికిత్స కిట్ బాక్స్‌లు, బ్యాడ్జీలు తదితర వస్తువులను ప్రదర్శనలో ఉంచారు.
ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ.. 1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు, యుద్ధం ఎందువల్ల ప్రారంభమైంది.. అప్పుడు సైనికుల మానసిక స్థితి ఎలా ఉంది.. తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ప్రదర్శనను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. త్వరలో ఈ ఎగ్జిబిషన్‌ను ఫ్రాన్స్‌తో పాటు పలు దేశాల్లో ప్రదర్శించనున్నట్లు వివరించారు. కాగా, ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించేందుకు యుద్ధం నాటి ఫొటోలను ఇంపీరియల్ వార్ మ్యూజియం, బ్రిటిష్ లైబ్రరీ, లండన్, ఫ్రెంచ్ మిలటరీ లైబ్రరీ, ఫ్లండర్స్ మ్యూజియం, బెల్జియం వంటి ప్రాంతాలనుంచి తెప్పించినట్లు సింగ్ చెప్పారు.
అలాగే అప్పటి భారత సైనికులు యుద్ధ రంగంలో చిత్రీకరించిన నిశ్శబ్ద చిత్రాలు, సౌండ్‌రికార్డింగ్‌లను సైతం ఇందులో పొందుపరిచినట్లు వివరించారు. ఈ సందర్భంగా 18వ సైనికుల రెజిమెంట్‌లో పనిచేసిన పరమవీర్ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ యోగేందర్ సింగ్ యాదవ్ సహా పలువురు సైనికుల నుంచి వివరాలు సేకరించి రోలీబుక్స్ సంస్థ ప్రచురించిన పుస్తకాన్ని సింగ్‌కు ఆ సంస్థకు చెందిన ప్రమోద్‌కుమార్ అందజేశారు. కాగా, ఈ ఎగ్జిబిషన్‌ను రోలీబుక్స్, ఫ్రెంచ్ ఎంబసీ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కార్యక్రమంలో ఫ్రాన్స్ అంబాసిడర్ ఫ్రాంకోయిస్ పాల్గొన్నారు.
మొదటి ప్రపంచ యుద్ధంజ్ఞాపకాల ప్రదర్శన ప్రారంభం
Published Mon, Jan 12 2015 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM
Advertisement