రైతు ఆత్మహత్యలకు కారణమెవరు..
జిల్లాలో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
{పభుత్వం పంట రుణాలు మాఫీ చేయలేదు
దళితులకు భూ పంపిణీలో కేసీఆర్ విఫలం
నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి
ఉప ఎన్నికలో బీజేపీకి గుణపాఠం చెప్పాలి
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్‌లో బహిరంగ సభ
ముగిసిన జగన్ నాలుగు రోజుల ప్రచారం
వరంగల్ : ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆసరా లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అందరికీ అన్నం పెట్టే రైతుల బలవన్మరణానికి కారణం ఎవరనేది అందరూ ఆలోచించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లాలోనే 150 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరపున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వరంగల్ పశ్చిమ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సెంటర్‌లో జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. సాధారణ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కేసీఆర్ ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేయలేదని, లక్ష రూపాయల పంట రుణాలను ఒకేసారి కాకుండా నాలుగు దశలుగా మాఫీ చేయడం వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. రుణాలు మాఫీ కాకపోవడంతో అవి రీ షెడ్యూల్ కాలేదని, దీనివల్ల రైతులు 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే మాఫీ మొత్తం వడ్డీకే సరిపోతోందన్నారు. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదని, ఈ పరిస్థితుల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు.
నిత్యావసరాల ధరలు అందకుండా పోతున్నాయని, కంది పప్పు కిలో ధర రూ.230 ఉందని, టమాటాలు కొనలేని పరిస్థితి ఉందన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, అత్యవసర వైద్య సేవల కోసం 108 సేవలను అందించారని గుర్తు చేశారు. వైఎస్సార్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పేదలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 108 సేవల కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేయలేదని చెప్పారు. జిల్లాలో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నా... ఎంపీగా ఉన్న వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఉప ఎన్నికను తీసుకువచ్చారని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రజల కోసం వస్తే బాగుండేదని, కేసీఆర్ మోజుపడిన వ్యక్తికి పదవి ఇచ్చేందుకు ఈ ఎన్నిక వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ 18 నెలల పాలనలో కేవలం 1600 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20.60 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దిక్కుమాలిన పార్టీ అని, కాంగ్రెస్ వాళ్లకు అవసరం ఉంటే దండలు వేస్తారని, అవసరం తీరాక బండలు వేస్తారని ధ్వజమెత్తారు. దివంగత నేత వైఎస్సార్ విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని, అబద్ధాలు, వెన్నుపోటుతో పాలన సాగిస్తున్న టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సాధారణ ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. పేదల కోసం తపించిన వైఎస్సార్ ఇప్పటికీ అందరి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు.
మహానేత వైఎస్సార్ ఆశయాలను కొనసాగించే వైఎస్సార్‌సీపీకే ఓటు అడిగే హక్కు ఉందని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారె డ్డి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రచార సభలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎడ్మ కిష్టారెడ్డ్డి, పి.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రొగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర కార్యదర్శులు ఎం.విలియమ్, సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర నాయకులు శేఖర్‌రెడ్డి, పి.ప్రపుల్లారెడ్డి, సుమిత్‌గుప్తా, మెరుగు శ్రీనివాస్‌రెడ్డి, సందీప్‌కుమార్, ఇ.సునీల్‌కుమార్, జిల్లా నాయకులు ఎం.కళ్యాణ్‌రాజ్, జి.రాజేశ్‌రెడ్డి, చల్లా అమరేందర్‌రెడ్డి, నెమలిపురి రఘు, సంగాల ఇర్మియా, నాగపురి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
నాలుగు రోజులు.. విశేష స్పందన
వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా చేపట్టిన ప్రచారానికి నియోజకవర్గ పరిధిలో మంచి స్పం దన వచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16న ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభించి గురువారం ముగిం చారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం నుంచి జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారం మొదలైంది. అక్కడి నుంచి జఫర్‌గఢ్, వర్ధన్నపేట, రాయపర్తి మీదుగా తొర్రూ రులో తొలి రోజు ప్రచారం జరిగింది. తొర్రూరులో జరిగిన ఎన్నిక ప్రచార సభ విజయవంతమైంది. మరుసటి రోజు ఆత్మకూరు, శాయంపేట, రేగొండ, భూపాలపల్లిలో పర్యటించిన జగన్.. పరకాలలో జరిగిన ప్రచారసభలో పాల్గొనగా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇక మూడో రోజు వరంగల్, గీసుగొండ, హన్మకొండలో ప్రచారం చేశారు. గీసుగొండలో జరిగిన ప్రచారానికి భారీగా జనం వచ్చా రు. అదే రోజు సాయంత్రం హన్మకొండలో జరిగిన బహిరసంగసభకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చివరిరోజు గురువారం హన్మకొండ, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, రఘునాథపల్లిలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారం సాగింది. స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన ప్రచారసభ విజ యవంతమైంది. ప్రచారంలో భాగంగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి.. హామీల అమలులో ప్రభుత్వ తీరు ను ఎత్తిచూపగా ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఈ మేర కు హన్మకొండలో నిర్వహించిన సభతో వైఎస్సాఆర్ సీపీకి జిల్లాలో ఉన్న బలం చాటినట్లయింది.