22,16,697 జిల్లాలోని ఓటర్ల సంఖ్య
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. మహిళా ఓటర్లతో పోలిస్తే పురుష ఓటర్లు పెరిగారు. ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితా సవరణ చేపట్టి తుది ఓటర్ల జాబితాను వెలువరించారు. నవంబర్, 2014 ఓటర్ల జాబితాను అనుసరించి జిల్లాలో 22,10,253 మంది ఓటర్లు ఉన్నారు. కాగా సవరణల అనంతరం జిల్లాలో ఓటర్ల సంఖ్య 22,16,697కు చేరుకుంది. జిల్లాలో మొత్తం 31,97,684 మంది జనాభా ఉండగా వీరిలో22,16,697 మంది ఓటర్లుగా నమోదు అయ్యారు.
జిల్లాలో ఓటర్ల సవరణల కోసం మొత్తం 24,418 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 11,935 దరఖాస్తులను వేర్వేరు కారణాలతో తిరస్కరించారు. పరిగణలోకి తీసుకున్న 12,483 దరఖాస్తులను పరిశీలించగా వీటిలో 6039 మంది ఓటర్లను తిరస్కరించటం జరిగింది. దీంతో కొత్తగా 6444 మంది ఓటర్లు పేర్లు తుది జాబితాలో చేర్చటం జరిగింది. సవరించిన తుది ఓటర్ల జాబితాతో పోలిస్తే జిల్లాలో ఓటర్లు 6444 మంది పెరిగారు.
తుది జాబితాను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో 0.29 శాతం మేర ఓటర్లు పెరిగారు. కాగా సవరణ జాబితా ప్రకారం జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య పెరిగింది. 2014 ఓటర్ల జాబితాలో జిల్లాలో 11,16,844 మంది పురుష ఓటర్లు ఉండగా తాజాగా పురుష ఓటర్ల సంఖ్య 11,20,163కు చేరుకుంది. 3319 మేర పురుష ఓటర్లు పెరిగారు. మహిళా ఓటర్లు గత ఓటర్ల జాబితాలో 10,93,289 మంది ఉండగా తాజా జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య 10,96,412కు చేరుకుంది. ఇతర ఓటర్లు 122 మంది ఉన్నారు. కొత్త ఓటరు జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న వారు పురుషులు 1950 మంది, మహిళలు 1377 మంది కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు.