అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటుకూ లింగ భేదం?
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వారం రోజుల్లో జరగనున్నాయి. పురుష ఓటర్లలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కే భారీ ఆదరణ కన్పిస్తుండగా మహిళలు మాత్రం డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ వైపే మొగ్గుతున్నారు. అగ్రరాజ్యంలోనూ రాజకీయంగా నెలకొని ఉన్న లింగ వివక్షను ఇది ప్రతిబింబిస్తోంది. ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో కూడా ఈ అంశం కీలకంగా మారింది. హారిస్ తొలినుంచీ ఇలాంటి గుర్తింపు రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఎక్కడా తను మహిళను కనుక ఓటేయండని కోరలేదు. దాన్ని ప్రచారాంశంగా మలచుకునే ప్రయత్నమూ చేయలేదు.
జాతి, జెండర్‌తో నిమిత్తం లేకుండా అమెరికన్లందరి శ్రేయస్సు కోసం పని చేయడానికి తానే సమర్థురాలినని నమ్ముతున్నట్టు పలు ఇంటర్వ్యూల్లో హారిస్ స్పష్టం చేశారు కూడా. అలా జెండర్‌ను తటస్థంగా ఉంచడానికి ఆమె ఎంత ప్రయత్నించినా అది ప్రధానాంశంగానే ఉంటూ వస్తోంది. ఎందుకంటే ‘మేడం ప్రెసిడెంట్’ అనేది అమెరికాకు చాలా కొత్త విషయం. ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా అత్యున్నత పీఠాన్ని అధిరోహించింది లేదు. ఈ నేపథ్యంలో హారిస్ ప్రెసిడెంట్ అవడమనే ఆలోచననే చాలామంది ఓటర్లు ఇష్టపడుతున్నారు. పలువురు అమెరికన్లు మాత్రం ఈ తరహా కొత్తదనాన్ని ఇబ్బందికరంగా భావిస్తున్నారు.
బహిరంగ రహస్యమే
హారిస్ తన ప్రచారంలో ఎక్కడా జెండర్ విషయాన్ని ప్రస్తావించకపోయినా లైంగికత అనేది అమెరికా సమాజంలోనే అంతర్లీనంగా దాగుందని, అధ్యక్షురాలిగా ఓ మహిళకు ఓటేయడానికి చాలామందికి ఇదో అడ్డంకిగా కనిపిస్తోందని భావిస్తున్నారు. ట్రంప్ ప్రచార బృందం కూడా పైకి జెండర్‌తో సంబంధం లేదని చెబుతున్నా, ‘‘హారిస్ బలహీనురాలు.
నిజాయితీ లేని వ్యక్తి. ప్రమాదకరమైన ఉదారవాది’’ తరహా ప్రచారంతో ఊదరగొడుతోంది. అమెరికా ప్రజలు ఆమెను తిరస్కరించడం ఖాయమంటోంది. అంతేగాక అధ్యక్ష అభ్యర్థుల్లోని ఈ లింగపరమైన తేడా తమకే లాభిస్తుందని ట్రంప్ ప్రచార బృందం సీనియర్ సలహాదారు బ్రయాన్ లాంజా బాహాటంగానే అన్నారు. ఫలితంగా ట్రంపే గెలుస్తారని తాను నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చారు.
‘మీటూ’ ప్రభావమెంత?
సమాజంలో తన స్థానంపై మహిళల దృక్కోణంలో 2016 నుంచి పెను మార్పులొచ్చాయి. 2017లో ‘మీ టూ’ ఉద్యమం పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే వివక్షపై సమాజంలో అవగాహనను ఎంతో పెంచింది. మహిళల గురించి మాట్లాడే విధానాన్నీ మార్చింది. కానీ భిన్నత్వం, సమానత్వం, సమ్మిళితం వంటి అంశాల్లో అంతటి పెద్ద ముందడుగును జీరి్ణంచుకునే స్థితిలో అమెరికా సంప్రదాయ యువకులు లేరు.
దీన్ని కేవలం తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంగా వారు భావిస్తున్నారు. అధ్యక్ష రేసులో లింగ అంతరం ప్రారంభమైందన్న సీబీఎస్ న్యూస్ పోల్ తాజా ఫలితాలు ఇందుకు అద్దం పట్టేవే. అమెరికాలో పురుషులు ప్రధానంగా ట్రంప్ మద్దతుదారులుగానే ఉన్నారు. హారిస్‌ను బలమైన నేతగా చూసే పురుషులు కూడా తక్కువగా ఉన్నారు. యువకులు చాలావరకు ట్రంప్, ఎలాన్ మస్క్ ‘బ్రో కల్చర్’లో నిండా మునిగి తేలుతున్నారు. ‘‘డెమొక్రాట్లు ఎంతసేపూ మహిళలు, గర్భస్రావ హక్కులు, ఎల్జీటీబీక్యూ సంస్కృతి గురించే మాట్లాడుతున్నారు. మరి మా పరిస్థితేమిటి?’’ అన్నది అమెరికా యువత నుంచి గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న. దీన్ని డెమొక్రాట్ల పాలిట డేంజర్ బెల్‌గా విశ్లేషకులు అభివరి్ణస్తున్నారు!
ఎంతో అంతరం
అమెరికా పురుషుల్లో 51 శాతం మంది ట్రంప్‌కు మద్దతిస్తుండగా హారిస్‌కు 45 శాతం మాత్రమే సానుకూలంగా ఉన్నట్టు ఇటీవలి సీఎన్‌ఎన్ జాతీయ ఓటర్ల సర్వే తేలి్చంది. హార్వర్డ్ యూత్ పోల్‌లో 30 ఏళ్ల లోపు మహిళల్లో హారిస్ ఏకంగా 47 శాతం ఆధిక్యంలో ఉన్నారు. అదే 30 ఏళ్లలోపు పురుషుల్లో ఆమెకు మద్దతిస్తున్నది కేవలం 17 శాతమే. దీంతో హారిస్ ప్రస్తుతం ఈ అంతరాన్ని తగ్గించే పనిలో పడ్డారు.
గత వారాంతంలో స్వింగ్ స్టేట్స్‌లోని పురుషులను లక్ష్యంగా చేసుకుని కొత్త ప్రకటనలకు తెరతీశారు. ‘బీ ఏ మాన్.. ఓట్ ఫర్ ఉమన్’ వంటి నినాదాలను నమ్ముకున్నారు. హారిస్ రన్నింగ్ మేట్ టిమ్ వాల్జ్ ప్రచార కూడా పలు కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, డిజిటల్ మీడియా కంటెంట్‌తో పురుష ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ట్రంప్ మాత్రం మరిన్ని ఇంటర్వ్యూలతో పురుష ఓటర్లకు మరింత దగ్గరవుతున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ‘లేడీస్ అండ్ జంటిల్‌మెన్’, ‘బాయ్స్ అండ్ గాళ్స్’ డిసైడ్ చేయబోతున్నారు. ఆ లెక్కన అమెరికన్ల జీవితంలో మహిళల పాత్రపై దీన్ని రెఫరెండంగా కూడా భావించొచ్చేమో!
‘పురుష నిస్పృహ’.. ట్రంప్ ఆయుధం!
అమెరికాలో యువతులతో పోలిస్తే యువకుల తీరు తీసికట్టుగానే ఉన్నట్టు గణాంకాలన్నీ చెబుతున్నాయి. కళాశాలలో యువకులు తక్కువగా చేరుతున్నారు. సమాజంతో సంబంధాలను కొనసాగించడమూ తక్కువే. ఆత్మహత్య రేటూ వారిలోనే ఎక్కువ. యువతులు బాగా చదువుకుంటున్నారు. సేవా రంగంలో రాణిస్తున్నారు.
యువకులతో పోలిస్తే ఎక్కువ సంపాదిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక యువకుల కంటే యువతులే బాగా ఉదారంగా మారినట్టు గాలప్ పోలింగ్ బృందం తెలిపింది. అయితే ఇవన్నీ అమెరికా సమాజంలో లింగ విభేదాలను మరింతగా పెంచేందుకే దోహదపడుతుండటం చింతించాల్సిన విషయమే. యువత అసంతృప్తులను ట్రంప్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ప్రచారం చివరి రోజుల్లో ఈ పురుష నిస్పృహపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ‘పురుషత్వం దాడికి గురవుతోంది’ అనే హెచ్చరికను తన సోషల్ మీడియా టూల్ ట్రూత్‌లో తిరిగి పోస్ట్ చేశారు.
హిల్లరీకీ ఇదే పరిస్థితి!
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ హోరాహోరీ పోరులో హిల్లరీ ఓటమికి లింగ వివక్ష, స్త్రీల పట్ల అమెరికా సమాజంలో దాగున్న వ్యతిరేకత కూడా కారణమైంది. అప్పుడు కూడా ప్రధాన ప్రత్యరి్థ, అధ్యక్ష పోరులో అంతిమ విజేత ట్రంపే కావడం విశేషం. ఈసారి వివక్ష కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నా మరోసారి గెలుపోటములను నిర్ణయించే కీలకాంశం కావచ్చన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి!
1920లో మహిళలకు ఓటు హక్కు
అమెరికా మహిళలు తొలిసారిగా 1920 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వారెన్ జి.హార్డింగ్ మొదటి ప్రపంచ యుద్ధం తాలూకు అనిశ్చితి నుంచి దేశం త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఆ ‘సాధారణ స్థితి’ అంటే ఏమిటో 100 ఏళ్లు గడిచినా సగటు అమెరికన్లకు అర్థం కావడం లేదు.
2024లో కూడా అమెరికన్ అంటే ‘పురుషుడా, లేక మహిళా?’ అనే ప్రశ్న అడుగడుగునా తలెత్తుతూనే ఉంది. చారిత్రికంగా తెల్లజాతి పితృస్వామ్యంలో నిండా మునిగి తేలుతూ వస్తున్న అగ్ర రాజ్యం ఇప్పుడు తమ నాయకురాలిగా నల్లజాతీయురాలైన మహిళను నామినేట్ చేసింది. ఫలితంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. 1920తో పోల్చుకుంటే ఆర్థిక, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందినా అమెరికా మహిళలు ఇప్పటికీ తమ శరీరాలపై హక్కులు తదితరాల కోసం పోరాడాల్సే వస్తోంది. రాజకీయంగా పోటీని మరింత బలంగా ఎదుర్కోవాల్సి వస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment