కార్డుల్లేక ప్రజలు బేజారవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ఆధార్ కార్డును లింకు చేయడంతో దుబ్బాక నియోజక వర్గంలో నేటికి 20 శాతం మంది ప్రజలకు ఆధార్ కార్డులు లేకపోవడం గమనార్హం.
దుబ్బాక: కార్డుల్లేక ప్రజలు బేజారవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ఆధార్ కార్డును లింకు చేయడంతో దుబ్బాక నియోజక వర్గంలో నేటికి 20 శాతం మంది ప్రజలకు ఆధార్ కార్డులు లేకపోవడం గమనార్హం. ఒక్కొక్కరు నాలుగైదు సార్లు ఫోటోలు దిగినా వారికి ఆధార్ కార్డు లభించలేదు. ఏదో ఒక్క కారణంతో ఫోటోలు దిగిన లబ్ధిదారుడు తిరస్కరణకు గురవుతున్నారు. కొందరికేమో ఫింగర్ ప్రింట్ సరిగా లేదని, మరి కొందరికి పోస్టల్ డీలేతో ఆధార్ కార్డులు ప్రజలుకు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం పెట్టిన పుణ్య కాలం దగ్గర పడుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
నియోజక వర్గ కేంద్రమైన దుబ్బాకతోపాటు మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, చేగుంట మండల కేంద్రాల్లో ఉన్న ‘మీ సేవా’ కేంద్రాల వద్ద రాత్రింభవళ్లు క్యూ లైన్లలో పడిగాపులు గాస్తున్నారు. చంటి పిల్లల తల్లిదండ్రులు, వయస్సు మీద పడ్డ వృద్ధులు క్యూ లైన్లో నిలబడలేక నానా అవస్థలు పడుతున్నారు. క్యూ లైన్లో నిలబడలేక చాలా మంది నీరసంతో కూలబడిపోతున్నారు. ఆధార్ కార్డు లేకుంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అనర్హులమవుతామన్న భయం ప్రజల్లో బాగా నెలకొంది. దీంతో మీ సేవా కేంద్రాలకు వచ్చే ఆధార్ లబ్ధిదారుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.
మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు 24 గంటల పాటు పని చేయాల్సి వస్తోంది. దుబ్బాక మీ సేవా కేంద్రానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మీ సేవా కేంద్రం మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు పని చేస్తూనే ఉంది. కార్డు దారులు కూడా రాత్రింభవళ్లు క్యూలైన్లో కూర్చుండడం విశేషం. అప్పుడప్పుడు సర్వర్ సరిగా సహకరించదు. ఆన్‌లైన్ సర్వీస్ అందుకోవడం లేదు. దీనికి తోడు అప్రకటిత విద్యుత్ కోతలు, ప్రజల నుంచి నిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతోంది.
చేసేదేమి లేక నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మండల కేంద్రంతోపాటు మండల పరిధిలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలన్నింటికీ ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ పనులు అప్పజెప్పితే పని భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డుల్లేని ప్రజలకు కూడా కొంత వెసులుబాటు కలుగుతోంది. ఆధార్ కార్డుల నమోదు చేసే మీ సేవా కేంద్రాల సంఖ్యను ప్రజల రద్దికనుగుణంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.