
ఏసీబీ చేతికి ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక
- కీలక దశకు ‘ఓటుకు కోట్లు’ కేసు దర్యాప్తు
- నివేదిక పరిశీలించి నోటీసులు జారీ చేయనున్న అధికారులు
- కీలక నేతలను విచారించేందుకు రంగం సిద్ధం
- నేటి నుంచి పూర్తిస్థాయిలో కార్యాచరణకు దిగాలని నిర్ణయం
- నోటీసులివ్వకుండానే నేతలను అదుపులోకి తీసుకునే యోచన
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో ముఖ్య ఆధారాలైన ఆడియో, వీడియో రికార్డులను విశ్లేషించి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) ఇచ్చిన నివేదిక శుక్రవారం ఏసీబీ చేతికి అందింది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా చర్యలు చేపట్టడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. నిందితులు, సాక్షుల నుంచి సేకరించిన సమాచారం, వారి ఇళ్లల్లో జరిపిన సోదాల్లో లభించిన ఆధారాలతో పాటు టీడీపీ ముఖ్య నేతలు నడిపిన కొనుగోళ్ల బాగోతంపై దృష్టి పెట్టింది. వీటన్నింటి ఆధారంగా కేసులో కీలకమైన వ్యక్తులను విచారించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
నోటీసులిచ్చినా హాజరుకాకుండా తప్పించుకుంటున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉదంతం నేపథ్యంలో.. ఇక ముందు నోటీసులతో సంబంధం లేకుండా నేరుగా ఆయా నేతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని విచారించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం నుంచి పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రారంభించాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం రేవంత్ బెయిల్‌కు సంబంధించి తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. ఆలోగానే కేసుతో సంబంధమున్న మరికొందరిని విచారించి, మరిన్ని ఆధారాలతో కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతా పకడ్బందీగా..
‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో సూత్రధారి అయిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఎలాంటి న్యాయ, చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా కార్యాచరణకు దిగాలని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించిన ఏసీబీ అధికారులు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది నిజమో కాదో వెల్లడించేందుకు వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా తొలుత చంద్రబాబుకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ విచారణకు చంద్రబాబు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. ఆయా పరిణామాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి.
చంద్రబాబును స్వర (వాయిస్) పరీక్ష కోసం పిలిపించేందుకు గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఒక కేంద్ర మంత్రి, ఇద్దరు ఎంపీలు, మరికొందరు నాయకులను విచారించేందుకు ఏసీబీ వేగంగా చర్యలు చేపడుతోంది. కీలక సాక్షిగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరిన 10 రోజుల గడువు ఈ నెల 29వ తేదీతో ముగియనుంది. గడువులోగా సండ్ర విచారణకు హాజరుకాని పక్షంలో ఆయనను అరెస్టు చేయాలని ఏసీబీ యోచిస్తోంది.