తొలికూత తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌దే..! | After Lockdown Telangana Express Was Earlier In Secunderabad Division | Sakshi
Sakshi News home page

తొలికూత తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌దే..!

Published Tue, Jun 2 2020 8:36 AM | Last Updated on Tue, Jun 2 2020 2:09 PM

After Lockdown Telangana Express Was Earlier In Secunderabad Division - Sakshi

సాక్షి, రామగుండం: డెభ్బై రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం సికింద్రాబాద్‌ డివిజన్‌లో ముందుగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కింది. కాగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే 200 శ్రామిక్‌ రైళ్లను నడిపించినా సాధారణ ప్రయాణికుల రాకపోకల నిమిత్తం కొన్ని రైళ్లను నడిపించక తప్పడం లేదు. లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం అందులో కొన్ని రైళ్లను సైతం నడిపించాలని నిర్ణయించింది. కాగా సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా  నాలుగు రైళ్లను నడిపిస్తుంది. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ముందస్తు రిజర్వేషన్‌ ఉన్నవారికే ప్రయాణానికి అనుమతిస్తున్న రైల్వేశాఖ రాకపోకలు సాగించేవారి పట్ల పటిష్ట చర్యలకు వైద్య సిబ్బంది శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా రైలు సమయానికి గంటన్నర ముందు స్టేషన్‌కు చేరుకోగానే రైల్వేశాఖ, వైద్య శాఖ అధికారులు వివరాలను నమోదు చేసుకొని థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. అదే విధంగా వేరే ప్రాంతాల నుంచి రామగుండంలో దిగినవారికి సైతం థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి వారి చేతికి క్వారంటైన్‌ ముద్ర వేసి ప్రయాణికుల చిరునామా పరిధిలోని వైద్య సిబ్బందికి సమాచారం అందించి పర్యవేక్షించాలని ఆదేశిస్తున్నారు. తొలిరోజు రామగుండం రైల్వేస్టేషన్‌ను డిప్యూటీ జిల్లా వైద్యాధికారి కృపాబాయి, రామగుండం తహసీల్దార్‌ రవీందర్‌ సందర్శించి వైద్య సిబ్బంది పనితీరును సమీక్షించారు. డాక్టర్‌ సురేష్, హెల్త్‌ సహాయకులు వడ్డెపల్లి సమ్మయ్య, ఏఎన్‌ఎం సరోజ, లక్ష్మి, రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ కేఎన్‌.రామారావు, రైల్వే డాక్టర్‌ దీప, ఆర్‌పీఎఫ్‌ సీఐ పాశ్వాన్, కమర్షియల్‌ అధికారులు తదితరులున్నారు.

హోంక్వారంటైన్‌ ముద్ర వేస్తున్న వైద్య సిబ్బంది
తెరుచుకున్న రైల్వే ఎంక్వయిరీ సిస్టం..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూతపడిన రైల్వే ఎంక్వయిరీ సిస్టం సోమవారం ప్రారంభం కావడంతో అధికారులు విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బుకింగ్‌ కార్యాలయం, పరిసరాలను పారిశుధ్య సిబ్బంది శానిటైజ్‌ చేశారు. కేవలం రైళ్ల సమాచారం మాత్రమే తెలుసుకునే వీలున్నప్పటికీ కార్యాలయంలో అధికారిక పనుల్లో నిమగ్నమయ్యారు. ఏలాంటి టికెట్ల జారీకి రామగుండంకు అనుమతించలేదు. ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా ప్లాట్‌ఫారంపై పెయింటింగ్‌తో బాక్సులు ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకలను సూచించే స్లైడింగ్‌ (డిస్‌ప్లే) ప్రారంభించారు. చదవండి: టీవీ నటి ఆత్మహత్య 

హోం క్వారంటైన్‌తో మొగ్గుచూపని ప్రయాణికులు..?
లాక్‌డౌన్‌కు ముందు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ప్రస్తుతం తమ స్వస్థలాలకు వెళ్లేవారు మాత్రమే రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. హోం క్వారంటైన్‌ ముద్ర వేయడంతో అత్యవసర పరిస్థితుల్లో పొరుగు ప్రాంతాలకు రైలులో వెళ్లి రావాలనుకునే అవకాశం లేకపోవడంతో రాకపోకలకు అంతగా ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతోంది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలులో హైదరాబాద్‌ నుంచి రామగుండంకు తొమ్మిది మంది ప్రయాణికులు రావాల్సి ఉండగా కేవలం ముగ్గురే దిగారు.

దాణాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పది మంది రామగుండంలో దిగాల్సి ఉండగా ఒక్కరు కూడా దిగకపోవడం గమనార్హం. ఇందులో కొంతమంది పెద్దపల్లిలో దిగినట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా దిగిన ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి వారి చేతిపై హోంక్వారంటైన్‌ ముద్రవేసి పంపిస్తున్నారు. స్టేషన్ల వారీగా దిగే, ఎక్కే ప్రయాణికుల జాబితా, బోగీ వివరాలను రైలులో టీటీఈతో పాటు భద్రతా సిబ్బంది పరిశీలిస్తూ ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నారు.


రాకపోకలను పరిశీలిస్తున్న రైల్వే అధికారులు

తొలిరోజు పెద్దపల్లికి దాణాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌..
పెద్దపల్లికమాన్‌: సికింద్రాబాద్‌ నుంచి దాణాపూర్‌ వరకు ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సోమవారం పెద్దపల్లి జంక్షన్‌ మీదుగా వెళ్లాయి. ఈ మేరకు దానాపూర్, వారణాసీ, బీహార్, మహారాష్ట్రకు వెళ్లే 17 మంది ప్రయాణికులు రైలు వచ్చే సమాయానికి గంటముందే రైల్వేస్టేషన్‌కు చేరుకోగా వైద్యాధికారి మమత నేతృత్వంలో వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించిన తర్వాతే వారిని ప్రయాణానికి అనుమతించారు. కార్యక్రమంలో వైద్యబృందం ఉమా మహేశ్వర్, జయమణి, రజియా, భాగ్యలక్ష్మి, స్టేషన్‌ మేనేజర్‌ వెంకట్, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు. చదవండి: తాకట్టులో సాగరిక.. విడిపించిన మాజీ ఎంపీ

నేటి నుంచి ఎనిమిది రైళ్ల రాకపోకలు
రామగుండం: లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా తొలిసారిగా 70 రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి తెలంగాణ మీదుగా నడిచే నాలుగు రైళ్లను ప్రారంభించారు. కాగా తొలిరోజు సదరు రైళ్లు గమ్యస్థానాలకు బయలుదేరినప్పటికీ రామగుండంకు మరుసటి రోజు చేరుకోనున్నాయి. దీంతో మంగళవారం నుంచి ఇరువైపుల ఎనిమిది రైళ్లు రాకపోకలు సాగించనుండడంతో వైద్య సిబ్బంది షిఫ్టుల వారీగా రైల్వేస్టేషన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ విధులు నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఉన్న రాకపోకలు సాగించే సమయాలే ఇప్పుడు వర్తిస్తాయి. ప్రస్తుత రైళ్ల రాకపోకల సమయాలు ఏమీ మారలేదని రైల్వే అధికారులు తెలిపారు.

పెద్దపల్లి, రామగుండం మీదుగా నడిచే రైళ్లు..
న్యూఢిల్లీ నుంచి విశాఖపట్టణం మధ్య నడిచే ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.02805/02806) ఇరువైపుల రాకపోకలు సాగించనుంది. పెద్దపల్లి, రామగుండంలో హాల్టింగ్‌ 
ఉంది.
దాణాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య నడిచే దాణాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.02792/02791) ఇరువైపుల రాకపోకలు సాగించనుంది. పెద్దపల్లి, రామగుండంలో హాల్టింగ్‌ ఉంది.
హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.02724/02723) ఇరువైపుల రాకపోకలు సాగించనుంది. పెద్దపల్లి, రామగుండంలో హాల్టింగ్‌ ఉంది.
దాణాపూర్‌ నుంచి ఏఎస్‌ఆర్‌ బెంగళూరు మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.02296/02295) ఇరువైపుల రాకపోకలు సాగించనుంది. ఒక రామగుండంలోనే హాల్టింగ్‌ ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement