
నేడు సర్వం బంద్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : కేంద్రప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికుల సంఘాల ఒక్కరోజు సార్వత్రిక సమ్మె నేపథ్యంలో బుధవారం జిల్లాలో సర్వం బంద్‌కానున్నాయి. బస్సులు, ఆటో లు, ఇతర ప్రజారవాణా వాహనాలు నిలిచిపోనున్నాయి. థియేటర్లు, పెట్రోల్‌బంకులు మూతపడనున్నాయి. అన్నిరంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. బీఎంఎస్ మినహా దేశవ్యాప్తంగా 12 కార్మికసంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. జిల్లావ్యాప్తంగా సుమారు రెండులక్షల మందికి పైగా వివిధరంగాల కార్మికులు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఉంది. వీరితోపాటు మరో 20వేల మంది బీడీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఫ్యాక్టరీచట్టం సవరణల పేరుతో కార్మికుల హక్కులను కాలరాస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సమ్మెకు టీజేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు మధ్యాహ్నభోజన సమయంలో కలెక్టరేట్ ఆవరణలో ధర్నా నిర్వహించనున్నట్లు టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి వెల్లడించారు. సమ్మెలో భాగంగా టీఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో కొత్తూరు నుంచి జిల్లాకేంద్రం వరకు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ తెలిపారు. సమ్మెలో భాగంగా టీఎస్‌ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. రోడ్టు ట్రాన్స్‌పోర్టు, రోడ్డు భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా ఆర్టీసీ, ఆటో కార్మికులు సమ్మెకు మద్దతు ఇస్తున్నారు. ఈ బిల్లుతో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసే కుట్ర జరుగుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
వివిధ సంఘాల మద్దతు
నేడు నిర్వహించే సార్వత్రికసమ్మెకు వివిధ కార్మిక, పార్టీలు మద్దతు తెలిపాయి. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పర్వతాలు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాంమోహన్, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్‌నర్సింహా, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కురుమూర్తి, ఐఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి హనుమంతు, టీఎంయూ రీజినల్ కార్యదర్శి డీఎస్ చారీ, ఈయూ రీజినల్ కార్యదర్శిసాయిరెడ్డి, ఎన్‌ఎంయూ నేత వహిద్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నేత వీరాంజనేయులు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాలెన్న మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో బంద్‌కు మద్దతు తెలిపారు.